- హర్భజన్‌కు సెక్యూరిటీని తొలగించిన పంజాబ్ సర్కార్
- సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్‌కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న హర్భజన్ నివాసం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శనివారం (ఏప్రిల్ 25) నిరసనలు చేపట్టారు. దీంతో ఆదివారమే కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పించడం గమనార్హం.
హర్భజన్ సింగ్ మాజీ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న హర్భజన్ సింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. రాఘవ్ చద్దాతో పాటు బీజేపీలో చేరిన ఆరుగురు సభ్యుల్లో హర్భజన్ ఒకరు. భజ్జీకి ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారు.
హర్భజన్‌కు భద్రత కల్పించాలని కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడగానే పంజాబ్ పోలీసులు ఆయన భద్రతను ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. పార్లమెంటు సభ్యుడైన హర్భజన్‌కు పోలీస్ భద్రతలో 9-10 మంది సిబ్బంది ఉండేవారు. శనివారం ఆ భద్రత తీసివేశారు. ఇప్పుడు జలంధర్‌లోని ఆయన ఇంటి బయట సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కనిపిస‍్తున్నారు.
శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేసిన నిరసనల్లో హర్భజన్ ఇంటి గోడపై ద్రోహి అని స్ప్రే పెయింట్ వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా ఇళ్ల ముందు కూడా ఇలాంటి నిరసనలే జరిగాయి.
రాఘవ్ చద్దాతో కలిసి బీజేపీలో చేరినవారిలో సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్‌జిత్ సహ్నే ఉన్నారు.
మరోవైపు, ఇటీవలే రాఘవ్ చద్దాకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. ఆయనకు పంజాబ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ స్థానం నుంచి ఆప్ తొలగించింది. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శాపూర్వకంగా మాట్లాడలేదని ఆప్ ఆరోపించింది.


