అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు.. కానీ తెలంగాణకు: కేటీఆర్‌

KCR Interesting Comments About KCR Hyderabad Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌నగర్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. డంప్‌యార్డ్‌ను క్యాపింగ్‌ చేయడం ద్వారా కొంతమేర సమస్యలు తీర్చగలిగామని, వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పలువురు కార్పొరేటర్లు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘‘జవహర్‌నగర్‌ నగరానికి పెద్ద దిక్కుగా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం. ప్రత్యేక నిధుల మంజూరు అంశంపై దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నారు. 

మనకు రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు.. 
అదే విధంగా కేసీఆర్‌ సర్కారు చేపడుతన్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ... ‘‘కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం. ప్రతి వర్గానికి, ప్రతి పేదవాడికి లబ్ది చేకూరేలా ప్రభుత్వం పని చేస్తోంది. భవిష్యత్తులో కూడా కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా ఎదురొడ్డి సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపిస్తాం. ప్రజలు తప్పకుండా పనిచేసేవారిని, ఆ నాయకుడిని గెలిపించుకుంటారు. వారికి అండగా ఉంటారు.

2014 నాటి నుంచి కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా.. మళ్లీ ఆయనను సీఎం చేసుకున్నారు. ఎవరెన్ని కుప్పిగంతలు వేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. సందర్భం ఏదైనా, ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు ఉంటారు. గతంలో చెప్పాను.. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు కాబట్టి... తప్పకుండా వారి నాయకత్వమే మనకు శ్రీరామరక్ష. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top