సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ, కార్మికుల నాయకులను ప్రభుత్వం పిలిచి వారి డిమాండ్లను ఒప్పుకోవాలి. 41 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ జేఏసీ తరపున సమ్మె తలపెట్టారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదు. 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని న్యాయమైన కోరికలు అడుగుతున్నారు.
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ 63 మంది కార్మికుల మరణానికి కారణమైంది. గతంలో ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వీడియోను అందరూ చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తానన్ని మూడేళ్లు అయ్యింది. రాష్ట్రంలో కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సులను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ నేతలు ఎక్కడిక్కడ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న. రెండు పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’ అని మండిపడ్డారు.


