చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ‍్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి.
ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.
తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్‌లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.
అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.
విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్‌మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన‍్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు.
"భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్‌మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.
భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.
ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు.


