గల్ఫ్‌ కార్మికులకు అన్యాయం... పత్తాలేని కొత్త సర్క్యులర్

Government Officers Failed To Circulate The New Circular On Gulf Minimum Labour Wages - Sakshi

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల గల్ఫ్‌ కార్మికుల కష్టాలు ఇంకా తీరలేదు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను క్షేత్రస్థాయికి చేరలేదు. దీంతో వలస జీవులు ఇంకా శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నారు. 

వేతనాలు తగ్గిస్తూ
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. 

పాత జీతమే ఇవ్వాలంటూ..
నలువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ లో జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఈ మేరకు పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయిస్తూ... జులై  15న ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద భీంరెడ్డి వేసిన  'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

జరగని న్యాయం
పాత వేతనాలే కొనసాగించాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్  కనీసం ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్‌లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లిఖిత పూర్వకంగా కనిపించకపోవడం కార్మికులకు శాపంగా మారగా కంపెనీలకు వరమైంది. గతంలో వేతనాలు తగ్గిస్తూ  ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌నే చూపెడుడుతూ తక్కువ జీతం చెల్లిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నాయి. 

ఎంబసీకి విజ్ఞప్తి
పాత వేతనాలను కొనసాగించే ఆ సర్క్యులర్ని  ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్క్యులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top