బాధాకరమే.. పరాజయం కాదు | Union Minister Kiren Rijiju fires on Congress Party | Sakshi
Sakshi News home page

బాధాకరమే.. పరాజయం కాదు

Apr 19 2026 5:36 AM | Updated on Apr 19 2026 5:36 AM

Union Minister Kiren Rijiju fires on Congress Party

బిల్లు వీగిపోవడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడి 

కాంగ్రెస్‌ పార్టీ మహిళా వ్యతిరేకి అని మండిపాటు  

మహిళా సాధికారత కోసం కృషి చేస్తూనే ఉంటామని స్పష్టికరణ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ముమ్మాటికీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మండిపడ్డారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి తాము చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ ఆడ్డుకుందని విమర్శించారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు వారి న్యాయమైన హక్కును కల్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. కిరణ్‌ రిజిజు శనివారం మీడియాతో మాట్లాడారు. బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమే అయినప్పటికీ దీన్ని తాము పరాజయంగా భావించడం లేదన్నారు.

మహిళల హక్కులను హరించివేసిన కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు చేసుకుంటోందని, అందుకు మహిళలు ఆ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు హక్కులను దూరం చేసి, అది విజయంగా భావించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మహిళా వ్యతిరేక మనస్తత్వం బట్టబయలైందని, అది ఆ పార్టీకి ఒక నల్ల మచ్చ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల మనోభావాలను కాంగ్రెస్‌ గాయపర్చిందని మండిపడ్డారు. దేశంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, వారికి సాధికారత కల్పించాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మహిళల బాగు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.  

ప్రతిపక్షాన్ని బలవంతం చేయలేం  
రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రభుత్వం, అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించాయని.. చివరకు సఫలం కాలేకపోయాయని కిరణ్‌ రిజిజు చెప్పారు. ఒక బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్రతిపక్షాన్ని భౌతికంగా బలవంతం చేయలేమన్నారు. పార్లమెంట్‌లో బిల్లులపై ఓటింగ్‌ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని తెలిపారు. ఈసారి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. లోక్‌సభ ఉత్పాతకత 93 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 110గా నమోదైందని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement