బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్‌ను అరెస్ట్‌ చేయాలి! | six children on a scooter in Bengaluru draws police attention Viral pic | Sakshi
Sakshi News home page

బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్‌ను అరెస్ట్‌ చేయాలి!

Apr 28 2026 2:41 PM | Updated on Apr 28 2026 4:01 PM

six children on a scooter in Bengaluru draws police attention Viral pic

సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక రద్దీ రోడ్డుపై ఆరుగురు చిన్న పిల్లలు ఒకే స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. రోడ్డు భద్రతా నియమాలను దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా, మైనర్లు డ్రైవింగ్ చేస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది?

శ్రేయాస్ అనే ఎక్స్‌ యూజర్‌  ఆఫీసుకి వెళ్తుండగా ఈ దృశ్యాన్ని చూసి, ఫోటోలు తీసి ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. బెంగళూరు నగర పోలీసులను, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ప్రకారం సుమారు 10 నుండి 12 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు మైనర్లు (ఆడ, మగ) పిల్లలు ఒకే స్కూటర్‌పై కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు.  రైడర్‌తో  పాటు అందరూ మైనర్లు కావడంతో తీవ్ర ఆందోళన రేపింది. రద్దీగా ఉండే బహిరంగ రహదారిలో ఒక చిన్న బాలుడే స్కూటర్‌ను నడుపుతున్నాడు. పైగా వీరిలో ఎవరికీ హెల్మెట్లు లేవు. దరిదాపుల్లో పెద్దలెవరూలేరు. ఈ ఘటన ఏప్రిల్ 26 గోరిపాళ్య సమీపంలోని పాదరాయణపుర మెయిన్ రోడ్డుపై జరిగింది.  

మరోవైపు ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆ పోస్ట్‌ను గుర్తించి, తదుపరి చర్యల కోసం మగడి రోడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, వాహన యజమానిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. 

ఇదీ చదవండి: అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్‌పై కత్తితో దాడి, షాకింగ్‌ రీజన్‌?

నెటిజన్ల ఆగ్రహం
స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ (KA05JZ9065) స్పష్టంగా కనిపిస్తుండటంతో, నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వీళ్లకి వాహనం ఇచ్చినందుకు తల్లిదండ్రులను కనీసం వారం రోజుల పాటు జైల్లో పెట్టాలి. వారి నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. "వేసవి సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ఇంత నిర్లక్ష్యమా?"  పెద్దోళ్ని చూసే పిల్లలు  నేర్చుకుంటారు. వీళ్లకి కేవలం జరిమానా వేస్తే సరిపోదని మరి కొందరు వ్యాఖ్యానించారు. 

నోట్ : మైనర్లు వాహనాలు నడపటం వల్ల ఇప్పటికే అనేక ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి హెచ్చరిస్తోంది. చట్టప్రకారం, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితేవాహన యజమాని లేదా తల్లిదండ్రులకు భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ వాహనం రిజిస్ట్రేషన్  కూడా రద్దవుతుంది. సదరు మైనర్‌కు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదు.

Advertisement
 
Advertisement
Advertisement