గ్యాంగ్‌టక్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ క్రీడా మైదానంలోకి దిగారు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. సిక్కిం 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవ (స్వర్ణోత్సవ) వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, ఉదయాన్నే క్రీడా మైదానంలో ఉత్సాహంగా గడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. చిన్నారులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఉదయాన్నే గ్యాంగ్‌టక్‌లో యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఈ సెషన్‌ను ‘అద్భుతమైన ఉదయం’, ‘ఎనర్జిటిక్ సెషన్’గా ఆయన అభివర్ణించారు. కాగా ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మిజోరాం, మణిపూర్ తదితర ప్రాంతాల్లో క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌కు విశేష ఆదరణ ఉంది.
Clearly, an energising football session with these youngsters! pic.twitter.com/Xc99oCylqt
— Narendra Modi (@narendramodi) April 28, 2026
సిక్కిం స్వర్ణోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి సోమవారం చేరుకున్న మోదీ, ముందుగా రెండు కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పద్మ అవార్డు గ్రహీతలు, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, క్రీడాకారులు తదితర ప్రముఖులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిక్కిం రాష్ట్ర పర్యావరణ, వృక్షసంపదకు ప్రతీకగా నిలిచే ‘ఆర్కిడేరియం’ను సందర్శించనున్నారు. అలాగే, పల్జోర్ స్టేడియంలో జరిగే స్వర్ణోత్సవ వేడుకల సభలో పాల్గొని, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, పర్యాటకం వంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఇది కూడా చదవండి: ‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం!


