‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్‌ యువకునికి నరకం! | Islamabad Man Arrested Over Strait of Hormuz Satire | Sakshi
Sakshi News home page

‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్‌ యువకునికి నరకం!

Apr 28 2026 11:21 AM | Updated on Apr 28 2026 12:03 PM

Islamabad Man Arrested Over Strait of Hormuz Satire

ఇస్లామాబాద్‌: సోషల్ మీడియాలో ఏదైనా జోక్ వేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన వింత పరిస్థితి పాకిస్తాన్‌లో నెలకొంది. తమ రోజువారీ ట్రాఫిక్ కష్టాలను వర్ణిస్తూ, ఓ యువకుడు సరదాగా చేసిన ఓ పోస్ట్ ఏకంగా అతన్ని కటకటాల వెనక్కి నెట్టివేసింది.

ఇస్లామాబాద్‌లోని టార్నోల్ రైల్వే క్రాసింగ్ వద్ద నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీపై ఓ యువకుడు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ చేశాడు. ‘టార్నోల్ రైల్వే క్రాసింగ్.. హార్ముజ్ జలసంధికి ఏమాత్రం తీసిపోదు. ఒకవేళ దీన్ని మూసివేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి’ అని అందులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాంటి సున్నితమైన అంశాన్ని స్థానిక రైల్వే గేటుకు ముడిపెడుతూ, చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

పోలీసుల యాక్షన్.. కఠిన సెక్షన్ల కింద కేసు
ఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఇస్లామాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలను ధిక్కరించడం, అక్రమ నిర్బంధం, నేరానికి యత్నించడం వంటి పాకిస్తాన్ పీనల్ కోడ్‌లోని పలు కఠినమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా సెక్షన్ 144 అమల్లో ఉందని, అందుకే ముందస్తు భద్రతలో భాగంగానే ఈ అరెస్ట్ చేశామని పోలీసులు ఈ చర్యను సమర్థించుకుంటున్నారు.

భావప్రకటనా స్వేచ్ఛపై మొదలైన తీవ్ర చర్చ
అయితే, భద్రత పేరుతో పోలీసులు చేసిన ఈ అరెస్ట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం డార్క్ హ్యూమర్‌తో చేసిన ఓ చిన్న కామెంట్‌ను జాతీయ భద్రతా ముప్పుగా భావించి, అరెస్ట్ చేయడం ఏంటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పలువురు మండిపడుతున్నారు. భద్రత, పౌర హక్కుల మధ్య సమతుల్యత పాటించడంలో అధికారులు విఫలమయ్యారని, ఒక జోక్‌కు ఇంతలా స్పందించడం సరికాదని స్థానిక పత్రికలు సైతం తమ సంపాదకీయాల్లో పోలీసుల తీరును ఎండగడుతున్నాయి.

ఇది కూడా చదవండి: షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్!

Advertisement
 
Advertisement
Advertisement