షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్! | Sri Lankan Monks Busted with 110kg Cannabis at Airport | Sakshi
Sakshi News home page

షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్!

Apr 28 2026 10:10 AM | Updated on Apr 28 2026 10:24 AM

Sri Lankan Monks Busted with 110kg Cannabis at Airport

కొలంబో: శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఒక ఉదంతం వెలుగుచూసింది. సన్యాస వస్త్రధారణలో ఉన్న 22 మంది వ్యక్తులు భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కొలంబో విమానాశ్రయంలో పట్టుబడ్డారు. థాయ్‌లాండ్ నుండి తిరిగి వస్తున్న వీరి వద్ద 110 కిలోల గంజాయి (కుష్, హషీష్) లభించడం అధికార వర్గాలను సైతం నివ్వెరపరిచింది.

సూట్‌కేసుల్లో రహస్య అరలు
కొలంబో విమానాశ్రయానికి చేరుకున్న ఈ బృందాన్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, అసలు బాగోతం బయటపడింది. స్వీట్లు, పాఠశాల సామగ్రితో పాటు సూట్‌కేసుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఫాల్స్ వాల్స్’ (రహస్య అరలు) వెనుక ఈ మత్తుపదార్థాలను  దాచారు. ఒక్కొక్కరి వద్ద సుమారు 5 కిలోల చొప్పున అత్యంత ప్రమాదకరమైన కుష్, హషీష్ రకాలకు చెందిన గంజాయి ప్యాకెట్లు లభించాయి. సన్యాసుల ముసుగులో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి యత్నించడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు.

ఉచిత థాయ్‌లాండ్ ట్రిప్ వెనుక మాస్టర్‌మైండ్
పట్టుబడిన ఈ సన్యాసుల(వేషధారణ)లో ఎక్కువ మంది విద్యార్థులే. ఒక గుర్తుతెలియని స్పాన్సర్ వీరికి నాలుగు రోజుల థాయ్‌లాండ్ పర్యటనకు పూర్తి ఖర్చులు భరించినట్లు సమాచారం. ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తిని పోలీసులు కొలంబో శివార్లలో అరెస్టు చేశారు. అతడు ఈ బృందంతో ప్రయాణించలేదు కానీ, వారు తీసుకొస్తున్న పార్శిల్స్ అన్నీ ‘విరాళాలు’ అని నమ్మించే ప్రయత్నం చేశాడు.

7 రోజుల రిమాండ్
పట్టుబడిన ఈ దొంగ సన్యాసుల మొబైల్ ఫోన్లను పోలీస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పరిశీలించగా, వారు థాయ్‌లాండ్ ట్రిప్‌లో సాధారణ దుస్తులు ధరించి, విలాసవంతంగా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. వీరందరినీ ఆదివారం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం కోర్టు ఏడు రోజుల పాటు రిమాండ్‌కు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement