‘ మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’ | NDA Women MPs Stage Protest in Parliament Premises | Sakshi
Sakshi News home page

‘ మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’

Apr 17 2026 9:18 PM | Updated on Apr 17 2026 9:34 PM

NDA Women MPs Stage Protest in Parliament Premises

న్యూఢిల్లీ:  లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడానికి కారణమైన పలు  పార్టీల వైఖరికి నిరసనగా ఎన్డీయే ఎంపీలు.. పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ బిల్లును విపక్షాలే ఓడించాయంటూ నిరసనకు దిగారు. విపక్ష ఎంపీలన దేశం క్షమించదు అంటూ నినాదాలు చేశారు.  ‘మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. 

మహిళా లోకానికి ఇది చీకటి రోజు అని అన్నారు బీజేపీ మహిళా ఎంపీ డీకే అరుణ. మహిళా రిజర్వేషన్‌ బిల్లు క్రెడిట్‌ మోదీకే దక్కుతుందన్నారు. రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. 

మరొకవైపు హైదరాబాద్‌లో బీజేవైఎం నేతలు.. విపక్ష నేత రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్‌ను రాహుల్‌ అడ్డుకోవడంపై మండిపడ్డారు. విపక్షాలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. 

విపక్షాల నిజస్వరూపం మరోసారి బయటపడిందంటూ బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు. 

కాగా, కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్‌ 17వ తేదీ) లోక్‌సభ వేధికగా జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే  డీలిమిటేషన్‌ బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.

సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన  రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్‌ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement