హ్యాట్సాఫ్‌ అమ్మ: పేగుబంధం పక్కన పెట్టి.. తాళిబొట్టు దొంగిలించిన కొడుకును పోలీసులకు పట్టించింది

Mother helps cops arrest criminal son - Sakshi

క్రైమ్‌: డబ్బు ప్రతీ మనిషికి అవసరమే. కానీ, ఆ అవసరం తీర్చుకోవడానికి తప్పుడు దారిలో వెళ్తే మాత్రం సహించనంటోంది ఆ అమ్మ.  తన కొడుకు దొంగతనం తెలిసిన వెంటనే గుండె పగిలినంత పని అయ్యింది ఆమెకు. అయినా దుఖాన్ని దిగమింగుకుని మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకుని.. కొడుకుని పోలీసులకు పట్టించింది. 

ముంబై విష్ణు నగర్‌ దేవి చౌక్‌లో సోమవారం ఉదయం పూట ఓ దొంగతనం జరిగింది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న 85 ఏళ్ల ఓ వృద్ధురాలి మెడ నుంచి తాళి బొట్టును లాక్కుని వెళ్లాడు ఓ వ్యక్తి. ఆ పెనుగులాటలో ఆమె కాలికి గాయం అయ్యింది కూడా. ఆలస్యం చేకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. విష్ణు నగర్‌ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పసుపు రంగు చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ఆ దొంగతనం చేసినట్లు గుర్తించారు. 

ఆపై ఆ వ్యక్తి ఫొటోను వాట్సాప్‌ గ్రూపుల్లో పంపించి.. అతన్ని ట్రేస్‌ చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో.. ఫూలే నగర్‌ వాసి నుంచి అతని గురించి తెలుసనే సమాచారం అందుకున్నారు విష్ణు నగర్‌ పోలీసులు. అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె పేరు తానిబాయి రాజు వాఘ్రి. ఆ ఫొటోలో ఉంది తన కొడుకు కణు అని చెప్పిందామె. అయితే అతని గురించి ఎందుకు అడుగుతున్నారని పోలీసులను నిలదీసింది. 

దీంతో పోలీసులు.. అతనికి యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పారు. అయితే.. అతను ఇంటి దగ్గరే ఉన్నాడని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. దీంతో అతను చేసిన పనిని ఆమె వివరించారు. తన కొడుకు మంగళసూత్రం దొంగతనం చేశాడన్న వార్త విని ఆ తల్లి కుమిలిపోయింది. పోలీసులను దగ్గర ఉండి మరీ ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. 

తన భార్యకు సర్జరీ అయ్యిందని, పూల వ్యాపారం సరిగా నడవకపోవడంతో డబ్బు కోసం ఇలా  దొంగతనం చేయాల్సి వచ్చిందని కణు నేరం ఒప్పుకున్నాడు. అయితే తమకు డబ్బు అవసరం అయిన మాట వాస్తవమే అయినా.. ఇలా మంగళసూత్రం ఓ పెద్దావిడ నుంచి దొంగతనం చేయడం, ఆమెను గాయపర్చడం తాను భరించలేకపోతున్నానని కన్నీళ్లతో చెప్పింది కణు తల్లి.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top