టీ కొట్టు మూయించిన ‘చాయ్‌వాలా’.. మహువా సెటైర్లు | Moitra Slams Chaiwala Modi over Kolkata Polls | Sakshi
Sakshi News home page

టీ కొట్టు మూయించిన ‘చాయ్‌వాలా’.. మహువా సెటైర్లు

Apr 28 2026 1:34 PM | Updated on Apr 28 2026 1:34 PM

Moitra Slams Chaiwala Modi over Kolkata Polls

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ.. కోల్‌కతాలో ఓ ఆసక్తికరమైన రాజకీయ వివాదం రేగింది. అదే ‍ప్రముఖ ‘బల్వంత్ సింగ్ చాయ్’ దుకాణం మూసివేత.. ఈ నేపద్యంలో ఇప్పుడు ‘చాయ్‌వాలా’ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరుగా మారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.

మహువా మొయిత్రా ఘాటు విమర్శలు
కోల్‌కతాలో ఏప్రిల్ 29న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ‘బల్వంత్ సింగ్ చాయ్’ దుకాణాన్ని రెండు రోజుల పాటు మూసివేశారు. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ, ‘చాయ్‌వాలా మనల్ని బల్వంత్ సింగ్ చాయ్ తాగకుండా ఆపినప్పుడే ఒక విషయం స్పష్టమైంది... కోల్‌కతాలోని ప్రతి సీటులోనూ బీజేపీ ఓడిపోవడం ఖాయం’ అని ఆమె ఘాటుగా విమర్శించారు.
 

మహువా పంచుకున్న ఒక స్క్రీన్‌షాట్ ప్రకారం.. భవానీపూర్ ప్రాంతంలో ఉన్న ఈ టీ స్టాల్ పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల లోపు ఉండటంతో అధికారులు సెక్షన్ 144 విధించారు. దీనివల్ల బల్వంత్ సింగ్ ధాబా, వారి చాయ్ అండ్ సమోసా కంపెనీలు ఏప్రిల్ 28, 29 తేదీల్లో వినియోగదారులకు నేరుగా సేవలు అందించవు. కేవలం ఆన్‌లైన్ డెలివరీ ద్వారా మాత్రమే ఈ రెండ్రోజులు తమ వ్యాపారాన్ని కొనసాగించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఉదయం పూట ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు నిబంధనల వల్ల నిర్మానుష్యంగా మారింది.

భవానీపూర్‌లో భీకర పోరు
కోల్‌కతా నడిబొడ్డున ఉన్న భవానీపూర్ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి (నందిగ్రామ్‌లోనూ పోటీ చేస్తున్నారు) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భవానీపూర్‌తో పాటు మరో 141 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏప్రిల్ 23న 152 స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, మే 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: గ్రౌండ్‌లో ప్రధాని మోదీ ‘కిక్’.. గ్యాంగ్‌టక్ షేక్! 

Advertisement
 
Advertisement
Advertisement