బ్లూడ్రమ్‌ కేసులో కీలక పరిణామం | Meerut Blue Drum Case: Victim Mother Sensational Allegations On Muskan | Sakshi
Sakshi News home page

బ్లూడ్రమ్‌ కేసులో కీలక పరిణామం

Apr 22 2026 2:08 PM | Updated on Apr 22 2026 2:30 PM

Meerut Blue Drum Case: Victim Mother Sensational Allegations On Muskan

గంజాయి మత్తులో.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి అటుపై పైశాచికంగా ప్రవర్తించింది ముస్కాన్‌ రాజ్‌పుత్‌. ఆపై ప్రియుడితో కలిసి జాలీ ట్రిప్‌ వేసి.. చివరకు భయంతో పోలీసులకు లొంగిపోయింది. మీరట్‌(ఉత్తర ప్రదేశ్‌) బ్లూడ్రమ్‌ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తన కొడుకు హత్యలో ముస్కాన్‌ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తోంది సౌరభ్‌ రస్తోగీ కుటుంబం. మంగళవారం కోర్టు విచారణ కోసం మీరట్‌ జిల్లా కోర్టుకు ఆరు నెలల చంటి బిడ్డ రాధతో ముస్కాన్‌, సాహిల్‌ వచ్చారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ కోర్టు హాల్‌లోకి రాగానే సౌరభ్‌ తల్లి రేణు దేవి భావోద్వేగానికి లోనయ్యారు.  

‘‘మరో మాట లేకుండా ఇద్దరినీ ఉరి తీయండి. చంటి బిడ్డ చేతిలో ఉందని కనికరించొద్దు. నా బిడ్డ నెలకు రూ.50 ఈమె కుటుంబానికి ఇచ్చేవాడు. ప్రతిగా వాళ్లు వాడ్ని దారుణంగా చంపారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. కానీ, వాళ్లను వదిలేసి ఈ ఇద్దరినే అరెస్ట్‌ చేశారు. అందరినీ శిక్షించాల్సిందే’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుందామె.

ఆ సమయంలో న్యాయమూర్తి భావోద్వేగాలను నియంత్రించుకోవాలని ఆమెకు సూచించారు. ఈ నేరంలో అభియోగాల ఆధారంగా చెరో 32 ప్రశ్నలు వేశారు జడ్జి. అందుకు సాక్ష్యం చూపించాలని సాహిల్‌ అడగ్గా.. ముస్కాన్‌ వాటిని తోసిపుచ్చింది. ఆపై కేసు విచారణను వాయిదా వేశారు.

బిడ్డను స్వీకరిస్తారా?
సౌరభ్‌-ముస్కాన్‌లకు ఓ కూతురు ఉంది. ఈ కేసు తర్వాత ఆ బిడ్డ సౌరభ్‌ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే అరెస్ట్‌ అయ్యేనాటికి ముస్కాన్‌ గర్భవతి. రిమాండ్‌ ఖైదీగా ఉన్న టైంలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్‌ఏ టెస్టులో నిర్ధారణ అయితే స్వీకరిస్తామని రేణు దేవి ఆ టైంలో చెప్పారు. కానీ, ఇప్పుడేమో ముస్కాన్‌ వల్ల ఆ బిడ్డ ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇటు ముస్కాన్‌ కుటుంబం కూడా ఆ పసికందును స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది.

సౌరభ్‌ రాజ్‌పుత్‌, ముస్కాన్‌ రస్తోగీ ఇద్దరూ 2016లో ప్రేమవివాహం చేసకున్నారు. భార్యతో సమయం గడిపేందుకు మర్చంట్‌ నేవీ జాబ్‌ను సైతం వదిలేశాడు సౌరభ్‌. ఇది ఇంట్లో గొడవలకు దారి తీయడంతో ఆమెతో వేరు కాపురం పెట్టాడు. మూడేళ్ల తర్వాత ఇద్దరికీ ఓ పాప పుట్టింది. అదే సమయంలో.. సాహిల్‌ అనే వ్యక్తితో ముస్కాన్‌ సంబంధం నడుపుతున్నట్లు సౌరభ్‌ గుర్తించాడు. ఈ వ్యవహారం దంపతుల మధ్య గడవలకు దారి తీసి.. విడాకుల దాకా తీసుకెళ్లింది. ఆ పంచాయతీ నడుస్తుండగానే.. భార్యలో మార్పు వస్తుందన్న ఆశతో ఎదురు చూశాడు సౌరభ్‌. ఆపై మర్చంట్‌ నేవీ ఉద్యోగంలో మళ్లీ చేరాడు సౌరభ్‌. ఉద్యోగం నిమిత్తం 2023లో బయట దేశాలకు వెళ్లాడు.

ఇదే అదనుగా ముస్కాన్‌, సాహిల్‌తో వివాహేతర సంబంధం కొనసాగింది. 2025 ఫిబ్రవరి 24న కూతురి పుట్టినరోజు వేడుకల కోసం చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చాడు సౌరభ్‌. ఇది భరించలేకపోయింది ముస్కాన్‌. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పెద్ద ప్లానే వేసింది.

మార్చి 4వ తేదీన సౌరభ్‌ తినే తిండిలో మత్తు బిళ్లలు కలిపింది ముస్కాన్‌. గాఢ నిద్రలోనే జారుకోగానే గంజాయి మత్తులో ఉన్న ఇద్దరూ కలిసి అతన్ని హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి ఓ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో నింపేశారు. సౌరభ్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి.. ఇద్దరూ వారంపాటు షికారుకు వెళ్లారు.  

కొన్నాళ్లకు డ్రమ్ము నుంచి కుళ్లిన వాసన రావడం.. ఆపై శవం చేయి బయటపడడంతో.. ఆందోళనకు గురైన ముస్కాన్‌ తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో ముస్కాన్‌ తండ్రే ఆమెను తమకు అప్పగించాడని పోలీసులు చెబుతున్నారు. అలా.. వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇటు సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement