ఉత్తర ప్రదేశ్‌లో సంచలన ఎన్‌కౌంటర్‌: కోర్టుకు అతిఖ్‌.. అదే టైంలో కొడుకు ఎన్‌కౌంటర్‌

UP Jailed Gangster Atiq Ahmed Son Asad Killed In Encounter - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ సంచలన చర్చకు దారి తీసింది. లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అహ్మద్‌ను.. ఝాన్సీ వద్ద పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే.. ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం.

2005లో జరిగిన బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్య కేసులో ఉమేశ్‌ పాల్‌ అనే లాయర్‌  ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన ఇంటి వద్ద దారుణంగా హత్య చేశారు. ఉమేశ్‌తో పాటు దాడిని అడ్డుకోబోయే ప్రయత్నం చేసిన ఆయన సెక్యూరిటీ సిబ్బందిని సైతం దుండగులు చంపేశారు. ఈ కేసులో అసద్‌తో పాటు గులాం అనే ఇద్దరు నిందితులుగా ఉన్నారు. 

ఈ క్రమంలో.. వీళ్ల కోసం గాలిస్తున్న యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ బృందానికి ఝాన్సీ వద్ద గురువారం బైక్‌పై పారిపోతున్న వీళ్లు కంటపడ్డారు. ఈ క్రమంలో వాళ్లను పట్టుకునే యత్నం చేసిన పోలీసులపై ఇద్దరూ కాల్పులు ప్రారంభించగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అసద్‌తో పాటు గులాం కూడా చనిపోయాడు. వీళ్లిద్దరిపై ఐదేసి లక్షల రూపాయల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, కొత్త సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ను 2006లో కిడ్నాప్‌ చేశాడనే కేసు అతిఖ్‌ అహ్మద్‌పైనా ఉంది. ఈ కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన అతిఖ్‌ అహ్మద్‌కు కిందటి(మార్చి) నెలలో శిక్ష కూడా పడింది.   సుమారు వంద కేసుల్లో నిందితుడైన అతిఖ్‌ అహ్మద్‌.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌పేరుతో తననూ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ సైతం అతిఖ్‌ కుటుంబ సభ్యుల ఇళ్లపై సోదాలు నిర్వహించింది కూడా. అతిఖ్‌ అలహాబాద్‌ వెస్ట్‌ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గాడు కూడా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top