త్వరలో ఆయుష్‌ వీసా

India Traditional Medicine System Holistic Science of Life: Narendra Modi - Sakshi

గాంధీనగర్‌: ఆయుష్‌ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) చికిత్స కోసం భారత్‌ వచ్చేవాళ్లకు ప్రత్యేక వీసా కేటగిరీ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ
బుధవారం ప్రకటించారు.  సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ప్రవేశపెట్టే ఆయుష్‌ మార్క్‌తో ఆ  ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుందన్నారు. 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్‌ పెట్టుబడుల సదస్సును ప్రారంభించాక హీల్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మారిషస్‌ ప్రధాని జగన్నాథ్, డ బ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఔషధ విధానాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ద్వారా నూతన సాంకేతికతలతో తయారయ్యే ఆయుష్‌ ఉత్పత్తులకు మార్కింగ్‌ ఇస్తారని మోదీ చెప్పారు. ‘‘సంప్రదాయ వైద్య విధానాల వల్లే కేరళలో టూరిజం పెరుగుతోంది. ఇది దేశమంతా విస్తరించాలి. హీల్‌ ఇన్‌ ఇండియా ఈ దశాబ్దానికి అతిపెద్ద బ్రాండ్‌ కావాలి’’ అన్నారు. దహోద్‌లో రూ. 20 వేల కోట్లతో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ప్లాంట్‌ పెడతామన్నారు.

1800 కోట్ల డాలర్ల విలువ
2014కు పూర్వం ఆయుష్‌ రంగ విలువ 300 కోట్ల డాలర్ల కన్నా తక్కువని, ప్రస్తుతమిది 1800 కోట్ల డాలర్లను దాటిందని మోదీ తెలిపారు. సంప్రదాయ వైద్య స్టార్టప్‌లకు ఆయుష్‌ శాఖ సాయం చేస్తుందన్నారు. ఈ రంగం నుంచి యూనికార్న్‌లు (వందకోట్ల డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లు) వస్తాయన్నారు. ఆయుష్‌ ఈమార్కెట్‌ పోర్టల్‌ను విస్తరించి రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తామని మోదీ తెలిపారు. విదేశీ మార్కెట్లలో ఆయుష్‌ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఆయుష్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేశామని టెడ్రోస్‌ చెప్పారు. భారత్, మారిషస్‌ మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు పలు అంశాలపై మోదీ, జగన్నాథ్‌ చర్చలు జరిపారు.

టెడ్రోస్‌ కాదు.. తులసీ భాయ్‌
హీల్‌ ఇన్‌ ఇండియా సదస్సుకు హాజరైన డ బ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌కు ప్రధా ని మోదీ తులసీ భాయ్‌ అని భారతీయ పేరు పెట్టారు. టెడ్రోస్‌ గుజరాతీలో ప్రసంగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నించడాన్ని అభినందించారు.

(చదవండి: పాల ఉత్పత్తిలో భారత్‌ టాప్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top