ఉచిత వ్యాక్సిన్‌పై ప్రధాని వైఖరి ఏంటి?: రాహుల్‌ | Exactly What Does PM Stand By Rahul | Sakshi
Sakshi News home page

ఉచిత వ్యాక్సిన్‌పై ప్రధాని వైఖరి ఏంటి?: రాహుల్‌

Dec 3 2020 8:28 PM | Updated on Dec 3 2020 8:42 PM

Exactly What Does PM Stand By Rahul - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్‌ అందించటం గురించి కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 95.3 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసిన కోవిడ్‌-19 మహమ్మారి వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ‘ప్రధాని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు. ఇటీవల జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఎన్డీఏ అదికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు, వ్యాక్సిన్‌ అందరికీ ఇస్తామని ఎన్నడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఇంతకీ ప్రధాని వైఖరి ఏంటి’? అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. 

కాగా వైరస్‌ వ్యాప్తిని విచ్ఛిన్నం చేస్తే దేశంలోని మొత్తం జనాభాకు వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం లేదని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అలాగే  దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామని ఎన్నడూ చెప్పలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్న మూడు ముఖ్యమైన ఫార్మా సంస్థలను ప్రధాని మోదీ సందర్శించిన మూడు రోజుల తరువాత భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. " భారత పౌరులందరికి వ్యాక్సిన్‌ అందించే ప్రయత్నంలో భాగంగా సన్నాహాలు, సవాళ్లు, రోడ్‌మ్యాప్ రూపొందించడం" ఈ పర్యటన ముఖ్య ఉద్ధేశ్యమని ప్రధాని కార్యాలయం తెలిపింది. కానీ ఉచిత వ్యాక్సిన్‌ హామీని ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించుకొని ఇప్పుడు విరమించుకుందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement