డీసీజీఐ ప్రకటనపై కాంగ్రెస్‌ అభ్యంతరం

DCGI Approval Of Coronavirus Vaccine Covaxin And Covishield In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌  కోవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి డీజీసీఐ ఆదివారం ఆమోదం తెలిపింది. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకి కూడా డీజీసీఐ ఆమోదం ప్రకటించింది. అయితే డీసీజీఐ ఆమోద నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల​ ట్రయల్స్‌ కొనసాగుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపడం సరికాదని విమర్శించింది. 

దానిపై కాంగ్రెస్‌ నేత, పార్లమెంటరీ ప్యానల్‌కు నాయకత్వం వహించిన ఆనంద్‌ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మూడో దశ క్లినికల​ ట్రయల్స్‌ కొనసాగిస్తున్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా అనుమతిపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్యానల్‌కు సమర్సించిన వివరాల ప్రకారం కొవాగ్జిన్‌ టీకా ఇంకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకోలేదని భద్రత, సమర్థతపై పూర్తి సమీక్ష జరగలేదని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్‌ నేతలు, ఎంపీ శశిథరూర్‌, ఆనంద్‌ శర్మ కూడా డీసీజీఐ కరోనా టీకా అమోద ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేశారు. మరో వైపు కాంగ్రెస్‌ నాయకుల అభ్యంతరాన్ని బీజేపీ ఖండించింది.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన రెండు టీకాలపై కాంగ్రెస్‌ నాయకులు అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు సైనికులను శౌర్యాన్ని ప్రశ్నించారని, అదీ కాక డీసీజీఐ ఆమోదం పొందిన రెండు టీకాలు భారత్‌లో అభివృద్ధి చెందడంతో వారు సంతోషంగా లేరని దుయ్యబట్టారు. టీకాల ఆమోదంపై రాజకీయం చేస్తున్నారిని మండిపడ్డారు. డీసీజీఐ అనుమతితో వారంలోనే భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌లో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల​ ట్రయల్స్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని డీసీజీఐ పేర్కొంది. డీజీసీఐ ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులు, ప్రజలకు ఊరట కలిగిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top