శశి థరూర్‌పై కాంగ్రెస్‌ ఆగ్రహం.. ‘రెండు ముఖాల’ ధోరణి అంటూ విమర్శలు

Congress Slams Tharoor For His Allegation Of Irregularities In Election - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్‌ వర్గం ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసుదన్‌ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే..శశి థరూర్‌ ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు మిస్త్రీ. మీకు రెండు ముఖాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘మేము మీ అభ్యర్థనను స్వీకరించాము. కానీ, మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని తెలియజేసేందుకు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో వేరే ముఖం ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను.’అని శశి థరూర్‌ తరఫు చీఫ్‌ ఎలెక్షన్‌ ఏజెంట్‌కు సమాధానం పంపించారు మిస్త్రీ. 

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలుడుతున్న క్రమంలో పోలింగ్‌ ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ బుధవారం మధుసుదన్‌ మిస్త్రీకి లేఖ రాశారు థరూర్‌ పోలింగ్‌ ఏజెంట్‌. నాలుగు రకాల ఫిర్యాదులను అందులో పేర్కొన్నారు. బ్యాలెట్‌ బాక్సులకు అనధికారిక సీల్స్‌ వేయటం, పోలింగ్‌ బూతుల్లో వేరే వ్యక్తులు ఉండటం, ఓటింగ్‌ జరుగుతున్న క్రమంలో అక్రమాలు, పోలింగ్‌ షీట్లు లేకపోవటం వంటి అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో శశి థరూర్‌కు 1,072 ఓట్లు రాగా.. మల్లికార్జున్‌ ఖర్గేకు 7,897 ఏట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top