అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: జిల్లాలో టీజీఎంఐఎస్‌డీసీ ఏజెన్సీ చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. మక్తల్‌లో రూ.34 కోట్లతో చేపట్టిన 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు, జిల్లాకేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం పక్కన 90 శాతం పనులు పూర్తయిన హ్యాండ్‌లూమ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆమె చూశారు. రూ.8.50 కోట్లతో చేపట్టిన హ్యాండ్‌లూమ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో తలుపులు, కిటికీలు, ఇతర ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం చుట్టూ ప్రహరీ, సీసీ రహదారి, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులు నెలలోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రూ.26 కోట్లతో నారాయణపేట మండలం అప్పక్‌పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో చేపట్టనున్న ఎంసీహెచ్ (మదర్, చైల్డ్ హాస్పిటల్) పనులను పరిశీలించారు. నర్సింగ్ కళాశాల రెండు బ్లాకులలో నిర్మాణంలో ఉన్న స్టడీ హాల్, డైనింగ్ హాల్, కిచెన్, టాయిలెట్ బ్లాక్, మీటింగ్ హాల్ పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, భవనం చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. ఆయన వెంట టీజీఎంఐఎస్‌డీసీ ఈఈ వేణుగోపాల్, చేనేత జౌళిశాఖ అధికారి సాయిబాబా, ఏఈ సాయి మురారి తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు
పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. మక్తల్, నారాయణపేట, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీలో ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆయా పుర కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఈ నెల 7, 8న ఓటు వేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు పుర కమిషనర్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం నోడల్ అధికారి, డీఏఓ జాన్ సుధాకర్(సెల్‌నంబర్ 63036 17267)ను సంప్రదించాలని కోరారు.


