
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. దీంతో ఇప్పటికే వారి కుటుంబాన్ని ఓదార్చేందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు వారి ఇంటికి చేరుకున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న తర్వాత ముంబై నుంచి అల్లు అర్జున్, మైసూర్ నుంచి రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తన అత్తయ్యను గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నేడు సాయింత్రం నిర్వహించనున్నారు.
చిరంజీవి ఎమోషనల్
మా అత్తయ్య గారు.. దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరమని చిరంజీవి అన్నారు. ఇరు కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ తమకు ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ సోషల్‌మీడియాలో చిరంజీవి పంచుకున్నారు.

'శ్రీమతి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖను తీర్చిదిద్దారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.' - పవన్ కల్యాణ్
అరవింద్ ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు
అల్లు అరవింద్ ఇంటి వద్దకు అందరికంటే ముందుగానే చిరంజీవి తన సతీమణి సురేఖతో చేరుకుని నివాళులు అర్పించారు. ఆపై పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ పార్థివ దేహానికి వెంకటేష్, త్రివిక్రమ్, వరుణ్ తేజ్, అది శేషగిరిరావు, శ్యామల దేవి , మెహర్ రమేష్, జీవిత, నిర్మాత నాగవంశీ, నాగచైతన్య, బోయపాటి శీను, వంటి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.