ఎన్టీఆర్‌తో నటించేటప్పుడు విలువలు నేర్చుకున్నా

Senior Actress L Vijayalakshmi Talks Abiut NTR - Sakshi

– ఎల్‌.విజయలక్ష్మి

‘‘నేను చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌గారిని ఆదర్శంగా తీసుకునేదాన్ని. ఆయనతో నటించేటప్పుడు క్రమశిక్షణ, సిన్సియారిటీ, అంకితభావం, నిబద్ధత, మాటతీరు.. వంటి విలువలు నేర్చుకున్నాను’’ అని సీనియర్‌ నటి ఎల్‌.విజయలక్ష్మి అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు ఎల్‌.విజయలక్ష్మి.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెకు హీరో బాలకృష్ణ గౌరవ సత్కారం చేశారు. అనంతరం ఎల్‌.విజయలక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఎంతో అభిమానంతో అమెరికా నుంచి నన్ను పిలిపించి గౌరవించడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. ఇందుకు బాలకృష్ణ, ఆలపాటి రాజా, బుర్రా సాయిమాధవ్‌లకు థ్యాంక్స్‌. వివాహం అయ్యాక సినిమాలు మానేసి అమెరికా వెళ్లాను. అక్కడ సీఏ చదివానంటే ఎన్టీఆర్‌గారి స్ఫూర్తి వల్లే.

రామానాయుడు, ఎన్టీఆర్‌గార్ల తరం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి వేడుకలకు రావాలనుంది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయలక్ష్మిగారు వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు. ‘‘1964లో మా బేనర్‌లో(సురేశ్‌ ప్రొడక్షన్స్‌) నిర్మించిన ‘రాముడు భీముడు’ సినిమాలో విజయలక్ష్మిగారు నటించారు.

అందులో ‘‘దేశమ్ము మారిందే..’ అనే సాంగ్‌ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో నాన్నగారు (రామానాయుడు) చెబుతుండేవారు’’ అన్నారు నిర్మాత డి.సురేశ్‌ బాబు. ఈ వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి, నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ, జూబ్లీహిల్స్‌ మాజీ కార్పొరేటర్‌ ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top