కేన్సర్‌ బాధితులకు అర్జున్‌ కపూర్‌ అండ!

Arjun Kapoor To Help Cancer Patients On This Valentines Day - Sakshi

మనం తరచూ చూసే అనేక సినిమాల్లో నటీనటులు సాయం కోసం ఎదురు చూసేవారికి చెయ్యందించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటివి చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో సాయం చేసే నటులు అరుదుగా కనిపిస్తారు. ఇటువంటి అరుదైన నటుల సరసన తాజాగా బాలీవుడ్‌ యాక్టర్‌ అర్జున్‌ కపూర్‌ చేరారు. కేన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్న నిరుపేదలకు సాయం చేయనున్నట్లు అర్జున్‌ కపూర్‌ ప్రకటించారు. ఈ ఏడాది వాలెంటైన్స్‌ డే సందర్భంగా 100 మంది కేన్సర్‌ బారిన పడ్డ దంపతులకు సాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. అర్జున్‌ తల్లి కేన్సర్‌తో మరణించారు. అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అర్జున్‌. ఇందులో భాగంగా కేన్సర్‌ పేషెంట్స్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌ (సీపీఏఏ) బృందంతో కలిసి పనిచేయనున్నాడు.

అర్జున్‌ మాట్లాడుతూ..‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోన్న సమయంలో అందరం ఎక్కడికక్కడ స్ట్రక్‌ అయిపోయాం. ఆ సమయం లో బీటలు వారిన మానవ సంబంధాలు, అనుబంధాలపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ అండగా నిలబడుతూ మన ఆలోచనా విధానంలో మార్పులు చేసుకున్నాం. నా ఆలోచనా తీరు కూడ మారింది. ఫిబ్రవరిలో ప్రపంచమంతా వాలెంటైన్స్‌ డే జరుపుకుంటూ...మనం ఎంతో ఇష్టపడే వారు ప్రత్యేకంగా ఫీల్‌ అయ్యేలా వివిధ కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ సారి నేను ఏదైనా కొత్తగా భిన్నంగా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ నిర్ణయంతీసుకున్నా’’ నని చెప్పాడు.

కేన్సర్‌ పేషెంట్స్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌తో కలిసి నిరుపేద 100 మంది కేన్సర్‌ బాధిత జంటలకు సాయం చేస్తానని చెప్పాడు. భార్యాభర్తలలో ఒకరు క్యాన్సర్‌ బారిన పడితే రెండో వారు ఆ సమస్యను ఎదుర్కోవడంలో ప్రతి అడుగులో తమ పార్టనర్‌తో కలిసి సమస్యలను ఎదుర్కొన్నవారే. అందుకే దంపతులను ఆదుకోవాలనుకున్నాను. ఒక పక్క కేన్సర్‌తో బాధపడుతూ ఉంటే మరోపక్క కోవిడ్‌–19తో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఆహారం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో అందరికి కాకపోయిన కొందరికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టానని అర్జున్‌ కపూర్‌ వివరించాడు. ఒక్కో పేషెంట్‌కు కీమో, రేడియో థెరపీలు, సర్జరీలు, మెడిసిన్స్‌ కోసం సంవత్సరానికి లక్ష రూపాయల వరకు అవసరమవుతాయి. అందువల్ల కేన్సర్‌ బారిన పడ్డ జంటకు లక్షరూపాయల నగదు సాయం చేస్తా’’ అని చెప్పాడు. కేన్సర్‌ బాధితులను ఆదుకునేందుకు మరింత మంది ముందుకు రావాలని అర్జున్‌ కపూర్‌ కోరాడు.

చదవండి: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: హీరో

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top