దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చాలా బోల్డ్ నటీమణల్లో ఆండ్రియా ఒకరు. కథానాయకిగా పలు చిత్రాల్లో నటించినా, ఇప్పుడు ఎలాంటి చాలెంజింగ్ పాత్రలు అయినా చేయడానికి రెడీ అనే నటి. ఇటీవల నిర్మాతగా కూడా మారి తాజాగా లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా నటించిన లీడర్ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఇకపోతే చాలాకాలం క్రితం సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్(యుగానికి ఒక్కడు). ఇందులో ఆండ్రియా, రీమాసేన్ హీరోయిన్‌గా నటించారు.
యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్ హీరోగా ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేస్తానని దర్శకుడు సెల్వరాఘవన్( Selvaraghavan) ఆ మధ్య ప్రకటించారు. అయితే ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఆ చిత్ర తొలి భాగంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన ఆండ్రియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయిరత్తిల్ ఒరువన్–2 చిత్రం గురించి మాట్లాడింది.

పార్ట్-1లో నటించిన అనుభవంతో ఆ తర్వాత తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ చాలా సులువుగా అనిపించిందని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో సెల్వరాఘవన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఏదీ జరగదని చెప్పింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమంటూ పేర్కొంది. కాబట్టి మళ్లీ ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదని పేర్కొంది. షూటింగ్ సమయంలో తాను అనుభవించిన మానసిక, శారీరక ఒత్తిడిని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె గుర్తుచేసుకుంది. తర్వాత ఎలాంటి పాత్ర వచ్చినా సరే చాలా ఈజీగా నటించగలిగానని పేర్కొంది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందవచ్చు, లేకపోవచ్చు కానీ, సీక్వెల్ తాను నటిస్తానని మాత్రం ఆశించవద్దని క్లారిటీ ఇచ్చింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం చాలా కష్టమని ఆండ్రియా పేర్కొంది.


