‘‘నా గత సినిమాల్లో కథలో ఒక చిన్న భాగంగా ప్రేమకథ ఉంటుంది. కానీ, ‘డెకాయిట్’లో మాత్రం ప్రేమకథే మెయిన్ ప్లాట్ ఫామ్. ఒక ప్రేమకథలో యాక్షన్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఒక యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీ చూసేందుకు వెళ్తే నిరుత్సాహపడరు. ఇందులోని భావోద్వేగాలన్నీ కూడా సహజంగా ఉంటాయి’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘డెకాయిట్’.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో అడివి శేష్ విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం. ‘డెకాయిట్’ తెలుగు ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. హిందీలో మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ రీచ్ ఉంది. పవన్ సింగ్‌గారు ‘డెకాయిట్’లో చేయడం భోజ్ పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజ్‌పురిలో కూడా ప్రీమియర్ వేస్తారా? అని ఫస్ట్ టైమ్ అడిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయం కావడంతో షూటింగ్ రెండు మూడు నెలలు ఆలస్యం అయింది. ఆ ఎఫెక్ట్ ‘గూఢచారి 2’ మూవీపైన కూడా పడింది. ‘డెకాయిట్’ కోసం 45 డిగ్రీల వేడిలో క్లైమాక్స్ చిత్రీకరించాం.
⇒ డైరెక్టర్ షానియల్ డియో, నేను బెస్ట్ ఫ్రెండ్స్. అయితే సినిమా విషయంలో మాత్రం రాజీపడం. మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటి. నాగచైతన్య–శోభితగార్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చిన సమయంలో అనురాగ్ కశ్యప్‌గారికి ఈ కథ చె ప్పాం. ఆయనకి నచ్చడంతో వెంటనే చేస్తానన్నారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ సుప్రియగారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌గారికి కూడా ఇది చాలా ఫ్రెష్ ప్రాజెక్టు అయింది. ‘డెకాయిట్’ తెలుగు వెర్షన్‌లో ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో...’ సాంగ్‌ని, హిందీలో ‘చీజ్ బడీ õß మస్త్..’ పాటని పెట్టాం. పోలాకి విజయ్‌గారు చాలా స్వీట్ కొరియోగ్రాఫర్.
⇒ ఈ సినిమాలో నేను చేసిన హరి పాత్ర క్యారెక్టర్‌ని బట్టి ‘డెకాయిట్’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ పాత్ర కోసం మదనపల్లి యాస ప్రాక్టీస్ చేశాను. నా నుంచి వరుసగా సినిమాలు రావాలంటే నేను రచయితగా ఉండకూడదనుకున్నాను. ‘గూఢచారి 2’ తర్వాత ఎమోషనల్‌గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నా. ‘డెకాయిట్’ ని డాల్బీలో రిలీజ్ చేయాలని మొదటి నుంచి అనుకున్నాం. అల్లు అరవింద్‌గారు ఫోన్ చేసి, సినిమా చాలా ప్రామిసింగ్‌గా ఉంది.. కలిసి పనిచేద్దామనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు 19 ఏళ్లు. దాన్నుంచి బయటపడడానికి పదేళ్లు పట్టింది. నేను సిగరెట్స్, మందు తాగను, నాన్ వెజ్ కూడా తినను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నాను. నా ‘గూఢచారి 2’ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది.


