ఇద్దరు దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగల అరెస్ట్‌

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

జగిత్యాలరూరల్‌: సారంగాపూర్‌ మండలకేంద్రంలోని రామాలయంలో గత నెల 25న దొంగతనం చేసిన వ్యక్తితో పాటు, అతనికి సహకరించిన ఒకరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గీత తెలిపారు. రామాలయం నుంచి 15తులాల రెండు వెండి కిరీటాలు గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణలో సారంగాపూర్‌కు చెందిన తునికి గంగచారిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రామాలయంతోపాటు, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రెండు వెండి కిరీటాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. వాటిని జగిత్యాలలోని కట్ట లక్ష్మణచారి వద్ద ముక్కలుగా చేసి.. పూదెల గణేశ్‌ వద్ద కరిగించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకున్నట్లు చెప్పాడు. గంగచారితోపాటు, కట్ట లక్ష్మణచారిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 13 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

బుగ్గారం: బుగ్గారం మండలం చిన్నాపూర్‌ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన తీగల రాజేందర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు అంజన్న దర్శనం ముగించుకుని కారులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చిన్నాపూర్‌ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మబ్బు పుష్పలతకు (48) తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే జగిత్యాలకు.. అక్కడి నుంచి కరీంనగర్‌ తరలిస్తుండగా మృతిచెందింది. తీగల రాజేందర్‌ ఫిర్యాదు మేరకు ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన మాదాసు ప్రదీప్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.

లారీ ఢీకొని కార్మికుడి దుర్మరణం

పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు దుర్గం మల్లయ్య(55) శనివారం లారీ ఢీకొని మృతిచెందాడు. స్థానికులు, బసంత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. మల్లయ్య బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీలో పర్మినెంట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున బైక్‌పై ఉదయం షిఫ్టు విధులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో ధర్మారం క్రాస్‌రోడ్డు పుట్నూర్‌ వైపువెళ్తున్న వాహనం ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోద చేసుకున్నారు. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ పర్మినెంట్‌ కార్మికసంఘం అధ్యక్షుడు మల్క రామస్వామి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ మౌర్య తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబానికి సానూభూతి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement