వాషింగ్టన్: హిల్టన్ హోటల్‌లో కాల్పుల నేపథ్యంలో ఆ ఉదంతానికి కొద్దిసేపటి ముందు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లెవిట్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఈరాత్రి జరగబోయే కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అద్భుతంగా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా మాటల తూటాలు పేలనున్నాయి. ఆ తూటా శబ్దాలను అందరూ విని తీరాల్సిందే’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు.
ట్రంప్ పదునైన పదజాలంతో, వాగ్ధాటితో ప్రసంగిస్తారనే ఉద్దేశంలో ఆమె మాట్లాడినా, కొద్దిసేపటికే కార్యక్రమంలో నిజంగా తూటాలు పేలడం సరదా వ్యాఖ్యలకు తావిచ్చింది. ‘‘తూటా పేలుళ్లను లీవిట్ ముందే పసిగట్టారు. ఇలా జరగబోతోందని ఆమెకు ముందే తెలుసేమో’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదంతా రాజకీయ ఎత్తుగడ కాదు కదా!!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
బాటిళ్లు తీసుకెళ్లారు!
ఓవైపు కాల్పుల మోత మోగుతుంటే కొందరు జర్నలిస్టులు మాత్రం మద్యం బాటిళ్లపై దృష్టిపెట్టారు! ఖరీదైన వైన్, షాంపేన్ బాటిళ్లతో సెలీ్ఫలు దిగారు. మరికొందరు వాటిని చెరోటి చంకలో పెట్టుకుని మరీ వెంట తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు వైన్ బాటిళ్లను వెంట తీసుకెళ్తున్న వీడియో వైరలైంది. అయితే ఈ సందర్భంగా పలువురు అగ్రనేతలు ప్రాణభయంతో పరుగెత్తుతుంటే, అది చూసి అక్కడే ఉన్న కొందరు మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు, అంతటి గందరగోళంలోనూ ఒక పెద్దాయన నింపాదిగా కూర్చుని హాయిగా మద్యం సేవిస్తూ స్టఫ్ తింటూ కన్పించారు!


