Green Card: గ్రీన్‌ కార్డులకు కోటా రద్దు

US bill to drop country cap for job green cards - Sakshi

బిల్లును ఆమోదించిన అమెరికా కాంగ్రెస్‌

సెనేట్‌ ఆమోదం, అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం

భారతీయ ఐటీ నిపుణుల్లో పెరుగుతున్న ఆశలు

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాస హక్కు(గ్రీన్‌ కార్డు) పొందేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల కల సాకారమయ్యే పరిణామమిది. గ్రీన్‌ కార్డుల జారీకి ఇప్పటివరకు ఉన్న దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు ప్రతినిధుల కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జో లోఫ్‌గ్రెన్, జాన్‌ కర్టిస్‌ అనే సభ్యులు ‘ది ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌(ఈఏజీఎల్‌ఈ)చట్టం– 2021’ను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 365 మంది వ్యతిరేకిస్తూ 65 మంది ఓటేశారు.

సెనేట్‌ ఆమోదం కూడా పొందితే అధ్యక్షుడు బైడెన్‌ సంతకంతో ఈ ప్రతిపాదనలు చట్ట రూపం దాల్చుతాయి. ప్రస్తుత వలస విధానంలో భారత దేశానికి కేటాయించిన 7 శాతం కోటా.. హెచ్‌–1బీ వర్కింగ్‌ వీసాపై అమెరికాలో ఉంటున్న అత్యున్నతస్థాయి భారతీయ నిపుణులకు గ్రీన్‌కార్డు లభించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. తాజా బిల్లులో, 7 శాతం పరిమితిని ఎత్తివేయడంతోపాటు ఈ కోటాను 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా ఇమిగ్రేషన్, సిటిజన్‌ షిప్‌పై ఏర్పాటైన కాంగ్రెస్‌ ఉప కమిటీ చైర్మన్‌ లోఫ్‌గ్రెన్‌ మాట్లాడుతూ.. ‘తాజా నిబంధనలు అమలైతే, నైపుణ్యాల ఆధారంగా గ్రీన్‌కార్డులు అందుతాయి. అమెరికా కంపెనీలు ఉత్పత్తులు, సేవలు, ఉద్యోగాలను కల్పించేందుకు గాను అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది’అని లోఫ్‌గ్రెన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనలపై సుమారు 10 లక్షల మంది భారతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top