ఇరాన్‌.. హర్ముజ్‌.. ట్రంప్‌.. అంతా గందరగోళమే! | Trump, Hormuz, Uranium Remarks; Iran Condemns, Confusion Deepens | Sakshi
Sakshi News home page

ఇరాన్‌.. హర్ముజ్‌.. ట్రంప్‌.. అంతా గందరగోళమే!

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 8:55 AM

Trump, Hormuz, Uranium Remarks; Iran Condemns, Confusion Deepens

పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేందుకు రెండో దఫా చర్చలకు అమెరికా-ఇరాన్‌లు సిద్ధపడుతున్నాయి. తేదీ ఇంకా ఖరారు కాకపోయినా మళ్లీ పాకిస్తాన్‌ వేదికగానే చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వరుస ప్రకటనలు.. ఇటు ఇరాన్‌ వాటిని ఖండించుకుంటూ పోతుండడం ఈ సంక్షోభంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

హర్ముజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌ ఓ మెట్టు కిందకు దిగింది. లెబనాన్‌ కాల్పుల విరమణ కుదరడంతో హర్ముజ్‌ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. ‘హర్ముజ్‌ను పూర్తిగా తెరిచాం. చమువురు నౌకల రాకపోకలను అడ్డుకోం. కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకలకు సురక్షితంగా మార్గం ఉంటుంది’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి ప్రకటించారు. ఈ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. పది శాతం దాకా రేట్లు తగ్గాయి. అయితే.. 

ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన గందరగోళానికి దారి తీసింది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల వ్యవహారం పూర్తయ్యే వరకు హర్ముజ్‌లో తమ బ్లాకేడ్‌(దిగ్బంధంనం).. అదీ ఫుల్‌ ఫోర్స్‌తో కొనసాగుతుందని ప్రకటించారు. అయితే.. చర్చల ప్రక్రియ త్వరగానే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు అంశాలపై చర్చలు జరిగాయని, వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. 

ఇరాన్‌ అన్నింటికీ అంగీకరించిందని.. కానీ యురేనియంపై డీల్‌ కుదిరేవరకు ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్‌ అన్నారు. ‘‘అణు కార్యక్రమాన్ని ఇరాన్‌ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్‌ డస్ట్‌” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్‌ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి అని వ్యాఖ్యానించారు.

అయితే.. ఇరాన్‌ మాత్రం ట్రంప్‌ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారని అంటోంది. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్‌ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్‌ బకాయీ స్టేట్‌ మీడియా టీవీ చానెల్‌లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్‌ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ఈ లెక్కన హర్ముజ్‌తో పాటు యురేనియం విషయంలో ఇరాన్‌ వెనక్కి తగ్గబోదని స్పష్టమవుతోంది. 

పశ్చిమాసియా యుద్ధంలో.. 
ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా.. ఇరాన్‌లో 3,000 మంది, లెబనాన్‌లో 2,100 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్‌ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

హర్ముజ్‌ జలసంధి.. శుద్ధి చేసిన యురేనియం, ఫ్రీజ్‌ చేసిన నిధులు.. ఈ విషయాల్లో రెండు దేశాల మధ్య చర్చల్లో ఎటూ తేలడం లేదు. ఈ నెల 11వ తేదీన పాక్‌ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చల్లో అయినా ఈ అంశాలు ఓ కొలిక్కి వస్తేనే యుద్ధం ఆగేది. లేకుంటే.. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేకపోలేదు.

ఇదీ చదవండి: ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు కాస్ట్‌లీ దెబ్బ

Advertisement
 
Advertisement
Advertisement