Roundup 2022: International Roundup Sakshi Special Story - Sakshi
Sakshi News home page

Roundup 2022: ఒక యుద్ధం.. ఒక హిజాబ్‌.. ఒక రాణి

Published Tue, Dec 27 2022 5:22 AM | Last Updated on Tue, Dec 27 2022 9:34 AM

Roundup 2022: International Roundup Sakshi Special Story

ఒక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తే, ఒక వైరస్‌ ప్రపంచదేశాల వెన్నులో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది. ఒక అమాయకురాలి మరణంతో ఈ హిజాబ్‌ మాకొద్దు అంటూ ఇరాన్‌ నవతరం నినదిస్తే, ఒక రాణి మహాభినిష్క్రమణంతో ఇంగ్లండ్‌లో ఒక శకం ముగిసిపోయింది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్‌ పాలనా పగ్గాలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తి తీసుకోవడం చూస్తే భూమి గుండ్రంగానే ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవడం ఒక మైలురాయి అయితే,  వాతావరణ మార్పులతో అగ్రరాజ్యాలు కూడా గడ్డ కట్టుకుపోవడం మన కళ్ల ముందే కనిపిస్తున్న కఠిన సత్యం. మొత్తంగా చూస్తే 2022 ప్రపంచదేశాలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి గురుతుల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఒక్కసారి 2022లోకి తొంగిచూస్తే...  

వార్తల్లో వ్యక్తులు  
జెలెన్‌స్కీ: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని  ఈ ఏడాది హీరోగా మారారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ యుద్ధానికి దిగితే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. వారంలో ముగిసిపోతుందనుకున్న పుతిన్‌ అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంకా కదనరంగంలో పోరాడుతున్నారు. జెలెన్‌స్క్‌లో ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించిన టైమ్‌ మ్యాగజైన్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కవర్‌ పేజీ ప్రచురించింది.  

రిషి సునాక్‌: ఒకప్పుడు భారత దేశాన్ని దాస్యం శృంఖలాల్లో బంధించి ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటన్‌కు భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల వయసుకే ప్రధాని పీఠమెక్కి బ్రిటన్‌ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్‌ను గట్టెక్కించడంలో లిజ్‌ ట్రస్‌ విఫలం కావడంతో టోరీ ఎంపీల మద్దతుతో ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్‌ ప్రధానిగా అక్టోబర్‌ 25న పదవీ ప్రమాణం చేశారు.

ఎలాన్‌ మస్క్‌: నిత్యం సమస్యలతో చెలగాటమాడడాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ని అక్టోబర్‌ 27న కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంస్థలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్క్‌ వంటి వివాదాలకు తెరలేపారు. చివరికి తాను ట్విట్టర్‌ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న పోల్‌ నిర్వహిస్తే 57.5% మంది ఆయన పదవికి రాజీనామా చేయాలని తీర్పునివ్వడం విశేషం.  

విషాదాలు  
► బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ (96) సంపూర్ణ జీవితాన్ని గడిపి అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్‌ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్‌ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు. 
► సోవియెట్‌ యూనియన్‌ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచెవ్‌ 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆగస్టు 31న కన్నుమూశారు. సోనియెట్‌ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు. సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. అందుకే నోబెల్‌ శాంతి బహుమానం ఆయనను వరించింది.
► జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఒక దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పలు జరపడంతో తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో తుది శ్వాస విడిచారు.  


ఎన్నికలు
► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ అక్టోబర్‌ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేశారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 20వ కాంగ్రెస్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు.  
► బ్రెజిల్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్‌ వింగ్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్‌ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 
► ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని అక్టోబర్‌ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు.  రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషం.  
► ఇజ్రాయెల్‌లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్‌ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్‌ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు.  
► నేపాల్‌లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్‌–మావోయిస్ట్‌ సెంటర్‌ పార్టీ చైర్మన్‌ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్‌ 26న ప్రమాణ స్వీకారం చేశారు.  


శ్రీలంక ఆర్థిక సంక్షోభం  
కరోనా ప్రభావంతో ఆర్థికంగా దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2.2 కోట్ల జనాభా ఉండే దేశంలో ధరాభారాన్ని ప్రజలు మోయలేని స్థితికి వచ్చేశారు. ఆహార పదార్థాలు కూడా అందరికీ సరిపడా పంపిణీ చేయడంలో విఫలం కావడంతో జూలైలో ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. జులై 9న ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో ఆయన దేశం విడిచివెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రణిల్‌ విక్రమ్‌సింఘె అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ శ్రీలంక ఇంకా అప్పులకుప్పగానే ఉంది.  

ప్రకృతి వైపరీత్యాలు  
► అఫ్గానిస్తాన్‌లో జూన్‌ 21నసంభవించిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు.  
► జూన్‌లో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. కొద్ది నెలల పాటు జనం నానా అవస్తలు పడ్డారు. అక్టోబర్‌ నాటికి పాకిస్తాన్‌లో వరద నష్టం 14.9 బిలియన్‌ డాలర్లుగా వరల్డ్‌ బ్యాంకు అంచనా వేసింది.
► ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఈజిప్టులో షర్మ్‌ఎల్‌–షేక్‌లో నవంబర్‌ 6 నుంచి 18 వరకు జరిగింది. పర్యావరణ విపత్తులతో నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి.  
► వాతావరణ మార్పులు ఈ ఏడాది అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వేసవికాలంలో వడగాడ్పులతో పశ్చిమాది దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌తో అమెరికా గడ్డకట్టుకుపోతోంది. మంచు తుపానుకు లక్షలాది మంది అంధకారంలో మగ్గిపోతూ ఇబ్బందులు పడుతున్నారు.


అవీ ఇవీ
► అమెరికాలో మారిలాండ్‌లో బాల్టిమోర్‌లో వైద్యులు ఈ ఏడాది జనవరి 12న పంది గుండెని మనిషికి అమర్చే శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే రెండు నెలలు తిరక్కుండానే మార్చి 9న ఆ వ్యక్తి మరణించడం విషాదం
► గర్భవిచ్ఛిత్తిపై అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అబార్షన్‌ను నిషేధం విధిస్తూ 1973లో రియో వెర్సస్‌ వేడ్‌ తీర్పుని జూన్‌ 24న తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో మహిళలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.  
► బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్‌–3 రాజ సింహాసనాన్ని అధిష్టించారు. సెప్టెంబర్‌ 17న ఆయన గద్దెనెక్కి తల్లి అంతిమ సంస్కారం సహా అన్నీ దగ్గరుండి నిర్వహించారు.  
► ప్రపంచ జనాభా మరో మైలు రాయి చేరుకుంది. మొత్తం జనాభా 800 కోట్లను దాటేసింది. ఫిలిప్పైన్స్‌ రాజధాని మనీలాలో నవంబర్‌ 15న జన్మించిన చిన్నారితో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది .
► కోవిడ్‌–19 ఈ ఏడాదితో ముగిసిపోతుందని అందరూ భావించినప్పటికీ చివరికొచ్చేసరికి చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ బీఎఫ్‌7తో రోజుకి 10 లక్షలకుపైగా కేసుల నమోదవుతున్నాయని, రోజుకి అయిదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టుగా ఒక అంచనా.   

        
పుతిన్‌ యుద్ధోన్మాదం  
ఉరుములేని పిడుగులా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రకటించడంతో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది. నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్‌ చేస్తున్న సన్నాహాలను తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్‌ రాత్రికి రాత్రికి బాంబు దాడులు చేశారు. పశ్చిమ దేశాల అండతో  ఉక్రెయిన్‌ రష్యా సేనల్ని సమర్థంగా ఎదుర్కొంటూ ఉండడంతో పది నెలలు గడుస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తే, పులి మీద పుట్రలా యుద్ధం  ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ యుద్ధంలో సాధారణ పౌరులే 10 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అంచనాలున్నాయి. ఉక్రెయిన్‌ నుంచి ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని ఏకంగా 78 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలతో చమురుకు కొరత ఏర్పడి ఎన్నో దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ధరల పెరుగుదల, ఆహారం కొరత , సరఫరాలో అడ్డంకులు వంటివాటితో ప్రపంచమే స్తంభించిపోయినట్టయింది. రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ  మానవ హక్కుల మండలి నుంచి రష్యాని సస్పెండ్‌ చేసింది.  

ఇరాన్‌లో మహిళల విజయగీతిక  
హిజాబ్‌ సరిగా ధరించని నేరానికి మహసా అమిన్‌ అనే 22 ఏళ్ల యువతిని నైతిక పోలీసులు సెప్టెంబర్‌ 13న అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు సెప్టెంబర్‌ 16న లాకప్‌లో ఆమె మరణించడంతో ఇరాన్‌లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 1979లో మత ఛాందసవాడులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి సవాళ్లు ప్రభుత్వం ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా యువతీ యువకులు ఏకమై రోడ్లపై హిజాబ్‌లను తగులబెట్టిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలో నిలిచాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 18 వేల మందిని అరెస్ట్‌ చేశారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి మోరల్‌ పోలీసు వ్యవస్థని రద్దు చేయడం ఆ దేశ ప్రజలు సాధించిన అతి పెద్ద విజయం. అయితే హిజాబ్‌ను రద్దు చేయాలంటూ 100 రోజులైనా ఇంకా ప్రజలు నిరసనలు చేస్తున్నారు.

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement