సవాళ్లకు పరిష్కారాల భారత్‌ | PM Narendra Modi was speaking at inauguration of Bharat Innovates event in France | Sakshi
Sakshi News home page

సవాళ్లకు పరిష్కారాల భారత్‌

Jun 15 2026 1:35 AM | Updated on Jun 15 2026 1:35 AM

PM Narendra Modi was speaking at inauguration of Bharat Innovates event in France

మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలపై దృష్టి పెట్టాం  

నూతన ఆవిష్కరణ అనేది భారతదేశ డీఎన్‌ఏలోనే ఉంది  

‘భారత్‌ ఇన్నోవేట్స్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి  

పారిస్‌: భారత్‌ ఇకపై ప్రపంచ దేశాల పరిష్కారాలను వినియోగించుకునే దేశం మాత్రమే కాదని.. సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించే దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై భారత్‌ దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. మోదీ ఆదివారం ఫ్రాన్స్‌లోని నైస్‌ సిటీలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి ‘భారత్‌ ఇన్నోవేట్స్‌’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియా, ఫ్రాన్స్‌ సహా వివిధ దేశాల స్టార్టప్‌ కంపెనీలు పాల్గొన్నాయి.

నూతన ఆవిష్కరణలు, సమ్మిళితత్వం వేర్వేరు కాదని... అవి పరస్పర ఆధారితమని తాము నిరూపించిట్లు మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఏ ఆవిష్కరణ గొప్పతనమైనా కేవలం దాని విలువలో కాకుండా, మానవ జీవితాలపై అది చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు.

దశాబ్దం క్రితం వరకు ప్రపంచం భారతదేశాన్ని సాంకేతికతను స్వీకరించే దేశంగా చూసేదని, నేడు దేశం సాంకేతికతను అందించే దేశంగా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. అంతేకాకుండా తమ దేశం సృష్టించే ఆవిష్కరణలు, అందించే పరిష్కార మార్గాలు మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయని వెల్లడించారు. ‘భారత్‌ ఇన్నోవేట్స్‌’లక్ష్యం ఇదేనని అన్నారు. సమ్మిళిత, మానవ–కేంద్రీకృత సాంకేతికత, నూ తన ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రస్తావించారు.  

సాంకేతిక విప్లవంతో కొత్త అవకాశాలు  
అత్యాధునిక సాంకేతికత, అణు శక్తి, రక్షణ, ఆవిష్కరణలతో సహా పలు కీలక రంగాల్లో తన ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సంస్కరణల పరంపర ఇక్కడితో ఆగదని, ఇది కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఇండియా నుంచి వెలువడే స్టార్టప్‌ల సంఖ్య అనేక రెట్లు పెరుగుతూనే ఉంటుందన్నారు. వివిధ దేశాల మధ్య సంఘర్షణలు, తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని మోదీ గుర్తుచేశారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అవకాశాలు సైతం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.

కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతలు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వెల్లడించారు. ఇవి మానవ నాగరికతలో తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తాయని అన్నారు. ప్రతి సాంకేతిక విప్లవం మానవాళికి ఒక కొత్త అవకాశాన్ని      కల్పిస్తుందని వివరించారు.

ప్రపంచం కోసం, సుస్థిర భవిష్యత్తు కోసం భారత్‌ అనేక ఆవిష్కరణలు చేస్తోందని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణ అనేది దేశం డీఎన్‌ఏలోనే ఉందని స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఒక ప్రత్యేక భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ఇందులో అనుబంధం, దృఢ విశ్వాసం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ పునాది ఆధారంగానే గత కొన్నేళ్లుగా ఉమ్మడిగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించామని మోదీ చెప్పారు.  

ఆవిష్కరణల దేశం భారత్‌: మేక్రాన్‌  
కృత్రిమ మేధ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్‌ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ చెప్పారు. భారత్‌ ఒక ఆవిష్కరణల దేశమని ప్రశంసించారు. ‘భారత్‌ ఇన్నోవేట్స్‌’ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. ‘మేక్‌–ఇన్‌–ఇండియా’ను గౌరవిస్తున్నామని తెలిపారు. ఇందులో వివిధ రంగాల్లో ఫ్రాన్స్‌ ఇందులో భాగస్వామిగా ఉందని వివరించారు. చిన్న మాడ్యులర్‌ రియాక్టర్ల రంగంతో సహా పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

‘భారత్‌ ఇన్నోవేట్స్‌’లో స్టార్టప్‌ల ఎగ్జిబిషన్‌ను మోదీ, మేక్రాన్‌ తిలకించారు. నూతన ఆవిష్కర్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, క్లీన్‌ ఎనర్జీ తదితర రంగాలకు చెందిన స్టార్టప్‌లు ఇందులో పాల్గొన్నాయి. గతంలో ఇండియాలోని జైపూర్‌లో జరిగిన ఆర్ట్‌ రెసిడెన్సీకి హాజరై, భారతీయ సంస్కృతి, కళల నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు ఫ్రెంచ్‌ కళాకారులు తయారు చేసిన కళాకృతులను ‘భారత్‌ ఇన్నోవేట్స్‌’లో ప్రదర్శించగా మోదీ, మేక్రాన్‌ తిలకించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement