పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్‌లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్‌లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్‌ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.
దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..
మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.
చైనాకు..
మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్‌లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.
మలక్కా డైలమా
చైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.
చైనాకు చుక్కలే
ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్‌లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.
భారత్‌కు ఫ్లస్
భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్‌బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్‌లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్‌కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది.
అంత వీజీ కాదు
మలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్‌కు చైనా మద్దతు.. ఇరాన్‌కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్‌కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే.


