మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Italy PM Giorgia Meloni lacks courage Says Trump Amid Iran War | Sakshi
Sakshi News home page

మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Apr 15 2026 10:41 AM | Updated on Apr 15 2026 10:49 AM

Italy PM Giorgia Meloni lacks courage Says Trump Amid Iran War

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహ బంధానికి బీటలు వారుతోంది. ఇరాన్‌ యుద్ధంలో అగ్రరాజ్యానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడం ఒక కారణం కాగా.. పోప్‌ లియో వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 

ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు మద్దతు ప్రకటించాలని ట్రంప్‌ ఇటలీపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ దేశ ప్రధాని మెలోనీ అందుకు తలొగ్గలేదు. ఇటలీని ఈ యుద్ధంలోకి లాగడం తన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె భావించారు. ఇరాన్ యుద్ధంలో తమ దేశం పాల్గొనబోదని.. ఇది ప్రపంచంలోనే పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 14న ఇజ్రాయెల్‌తో తమ దేశానికి ఉన్న రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈలోపు పోప్ లియో XIV ఇరాన్‌ యుద్ధంపై స్పందించడం.. ఆయనకు ట్రంప్‌ కౌంటర్‌ ఇవ్వడం తెలిసిందే. ఇరాన్ యుద్ధంపై పోప్‌ మాట్లాడటం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్‌ ఘాటుగా విమర్శించారు. అయితే ట్రంప్‌ పోప్‌పై చేసిన వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్‌నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 

ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని.. ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఇరాన్‌కు అవకాశం వస్తే ఇటలీని రెండు నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా.. యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వ్యాఖ్యానించారాయన. ఇక మీదట యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని.. అమెరికా సైన్యం ఇతరుల కోసం పోరాడబోదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో.. 

పోప్ లియో XIVపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని మెలోనీ అనడంపై స్పందిస్తూ.. వాస్తవానికి పోప్‌ కాదు మెలోనీనే కరెక్ట్‌ పర్సన్‌ కాదంటూ ట్రంప్‌ ఓ కామెంట్‌ చేశారు. 

జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా–యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ పేరు ముద్రపడింది. పైగా ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చు రాజేసినట్లైంది.

Advertisement
 
Advertisement
Advertisement