చర్చల వేళ మరో ట్విస్ట్‌.. అమెరికాకు ఇరాన్‌ తీవ్ర హెచ్చరిక | Iran Vows Decisive Response If US Continues Its Blockade | Sakshi
Sakshi News home page

చర్చల వేళ మరో ట్విస్ట్‌.. అమెరికాకు ఇరాన్‌ తీవ్ర హెచ్చరిక

Apr 25 2026 9:27 PM | Updated on Apr 25 2026 9:42 PM

Iran Vows Decisive Response If US Continues Its Blockade

టెహ్రాన్‌: మరోసారి అమెరికాను ఇరాన్‌ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్‌ పేర్కొంది.

ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్‌ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చింది.

మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్‌ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. 

ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్‌ శనివారం అధికారికంగా ప్రకటించింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement