చర్చలపై కొత్త ఆశలు!  | Iran Foreign Minister Abbas Araghchi arrived in the Pakistan | Sakshi
Sakshi News home page

చర్చలపై కొత్త ఆశలు! 

Apr 25 2026 4:46 AM | Updated on Apr 25 2026 6:11 AM

Iran Foreign Minister Abbas Araghchi arrived in the Pakistan

పాకిస్తాన్‌కు చేరుకున్న ఇరాన్‌ విదేశాంగ మంత్రి 

ఇస్లామాబాద్‌: పశ్చిమాసియాలో హార్మూజ్‌జలసంధి దిగ్బంధంతో రెండో దఫా చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ పాకిస్తాన్‌ చేరుకోవడం శాంతి చర్చలపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. పాకిస్తాన్‌తోపాటు ఒమన్, రష్యాల్లోనూ పర్యటించి శాంతి చర్చల్లో తేల్చుకోవాల్సిన కీలకాంశాలపై ఒక అవగాహనకు రానున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

‘‘టెహ్రాన్‌ నుంచి ఇస్లామాబాద్‌(పాకిస్తాన్‌), మస్కట్‌(ఒమన్‌), మాస్కో(రష్యా) పర్యటనకు శ్రీకారం చుడుతున్నా. ద్వైపాక్షిక అంశాలపై మా భాగస్వాములతో సహకారం కోసం ఈ మూడు దేశాల్లో పర్యటించబోతున్నా. పొరుగుదేశాలే మాకు ముఖ్యం’’అని అరాఘ్చీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స’ఖాతాలో శుక్రవారం ఒక పోస్ట్‌పెట్టారు. దీంతో రెండోదఫా చర్చలకు సన్నాహకాలు మొదలయ్యాయని తెలుస్తోంది. అరాఘ్చీ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు.

 అమెరికా దౌత్యవేత్తలకు సాయపడే బృందాలు, భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇస్లామాబాద్‌లో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సాంకేతిక బృందంతో ఇరాన్‌ మధ్యవర్తులు మాట్లాడి షెడ్యూల్‌ను ఖరారుచేశాక అసలైన అమెరికా ప్రతినిధుల బృందం శనివారం రాత్రికల్లా ఇస్లామాబాద్‌కు చేరుకుంటుందని పాక్‌ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. స్టీవ్‌ విట్కాఫ్, కుష్నర్‌లు శనివారం పాకిస్తాన్‌ చేరుకుంటారని అమెరికా కూడా ధ్రువీకరించింది.  

కొనసాగుతున్న దిగ్బంధం
‘‘ట్రంప్‌ సూచనమేరకు సముద్రమందుపాతరలను పెట్టే పడవలను పేల్చేందుకు కాచుకుని కూర్చున్నాం. దశాబ్దాల్లో తొలిసారిగా పశ్చిమాసియాజలాల్లో ఒకేసారి మూడు అమెరికా యుద్ధవిమానాల వాహక నౌకలు యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్, యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్, యూఎస్‌ఎస్‌ జార్జ్‌ హెచ్‌.డబ్ల్యూ.బుష్ లు చక్కర్లు కొడుతున్నాయి. 

200 యుద్ధవిమానాలు, 15,000 మంది నావికాదళసభ్యులు హార్మూజ్‌ను దిగ్బంధించాయి’’అని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు అమెరికాయేతర నౌకలు సైతం అమెరికా నౌకాశ్రయాల్లోకి ముడిచమురు, సహజవాయువులను సరఫరాచేసేందుకు వీలుగా జోన్స్‌ చట్టం అమలును మరో 90 రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు ఇరాన్‌ స్వాదీనంచేసుకున్న ఎపామినోండాస్‌ నౌకలోని భారతీయ నావికుడు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ శాఖ డైరెక్టర్‌ మన్‌దీప్‌ సింగ్‌ రణ్‌ధావా శుక్రవారం చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement