హర్ముజ్‌ ‍బ్లాకేడ్‌​​.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు | Hormuz blockade: Why China Strong Warning To US Amid blockade Row | Sakshi
Sakshi News home page

Hormuz blockade: అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు

Apr 14 2026 7:27 AM | Updated on Apr 14 2026 8:32 AM

Hormuz blockade: Why China Strong Warning To US Amid blockade Row

ఇరాన్‌ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్‌ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి.  అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.  

జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్‌ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్‌తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్‌ దిగ్బంధనం ప్రారంభమైంది. 

అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  హర్ముజ్‌ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్‌ఎన్‌జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్‌ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. 

అమెరికా, చైనా ఇరాన్‌పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. 

Advertisement
 
Advertisement
Advertisement