హార్మూజ్‌ దిగ్బంధం | Donald Trump Orders Naval Blockade of Iran After Failed Talks | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ దిగ్బంధం

Apr 14 2026 4:30 AM | Updated on Apr 14 2026 6:30 AM

Donald Trump Orders Naval Blockade of Iran After Failed Talks

ఇరాన్‌ రేవులను నిర్బంధించిన అమెరికా 

వాటినుంచి నౌకల రాకపోకలపై నిషేధం 

అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్‌ 

గల్ఫ్‌ పోర్టులపై దాడులు చేస్తామని హెచ్చరిక 

పశ్చిమాసియాలో రాజుకుంటున్న ఉద్రిక్తతలు 

కాల్పుల విరమణ కొనసాగింపుపై అనిశ్చితి 

ట్రంప్‌ కోరితే యుద్ధానికి సిద్ధమేనన్న ఇరాన్‌ 

కొత్త ‘వ్యూహా’లను ప్రయోగిస్తామని వ్యాఖ్యలు

హార్మూజ్‌ పూర్తిగా మా అ«దీనంలోనే: ఐఆర్‌జీసీ

కైరో/దుబాయ్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. చర్చల వైఫల్యంపై మండిపడుతున్న అమెరికా మరోసారి ఇరాన్‌పై తీవ్ర చర్యలకు దిగుతోంది. సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్‌ జలసంధితో పాటు ఇరాన్‌కు చెందిన ఓడరేవులన్నింటినీ దిగ్బంధించింది. హార్మూజ్‌ గుండా ఇరాన్‌ ఓడల రాకపోకలను కూడా అడ్డుకుంటోంది. చర్చలు విఫలమైతే హార్మూజ్‌ను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారమే హెచ్చరించడం తెలిసిందే. 

అమెరికా నావికా దళం సోమవారం సాయంత్రమే రంగంలోకి దిగింది. ఇరాన్‌ తీర ప్రాంతాలన్నింటినీ పూర్తిస్థాయిలో పహారా కాస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలూ ఇరాన్‌ రేవుల్లోకి రాకపోకలు జరపడానికి వీల్లేదని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. అయితే, ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను మాత్రం హార్మూజ్‌ గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని వెల్లడించడం విశేషం!

 ఇరాన్‌ ‘ఫాస్ట్‌ అటాక్‌’షిప్‌లు గనక తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్‌ అల్టిమేటమిచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. అంతేగాక ట్రంప్‌ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కన్పిస్తోంది. దాని గడువు ఏప్రిల్‌ 22 దాకా ఉంది. ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావడం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. 

అగ్ర రాజ్యం తాజా చర్యలపై ఇరాన్‌ మండిపడింది. గల్ఫ్‌ ప్రాంతంలోని ఓడరేవులన్నింటినీ పూర్తిస్థాయిలో లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతానని తీవ్రంగా హెచ్చరించింది. ‘‘పర్షియన్‌ గల్ఫ్, ఒమన్‌ సముద్ర ప్రాంత రక్షణ బాధ్యత ఈ ప్రాంతంలోని ప్రతి దేశానిదీ. మాపై దాడులు, దిగ్బంధాలు జరిగితే ఈ ప్రాంతంలోని ఏ రేవూ సురక్షితం కాబోదు’’అని ఇరాన్‌ సైన్యం, రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేశాయి. హార్మూజ్‌ ఇప్పటికీ పూర్తిగా ఇరాన్‌ అదుపులోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాయి. 

‘ట్రంప్‌కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే’అని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బఘేర్‌ గలీబాఫ్‌ స్పష్టం చేశారు. అంతేగాక ‘ఆటలో ఇప్పటిదాకా వాడని సరికొత్త ‘వ్యూహా’లను ఇకపై బయటికి తీస్తా’మంటూ ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి ఎబ్రాహీం రజెయ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిందేనని ఇరాన్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ విభాగం చీఫ్‌ ఎస్మాయిల్‌ ఖానీ ఎద్దేవా చేశారు. గత వారం కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి 40 వాణిజ్య నౌకలు హార్మూజ్‌ను దాటాయి. అమెరికా, ఇరాన్‌ నడుమ యుద్ధానికి తెర దించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు.

ఇరాన్‌ గమ్మత్తైన ‘గణిత’పోస్టు 
హార్మూజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్‌ హెచ్చరికలను ఇరాన్‌ ఎద్దేవా చేసింది. ఈ మేరకు గమ్మత్తైన గణిత సమీకరణాలతో ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘‘హార్మూజ్‌ దిగ్బంధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి. తర్వాత జరిగే చైన్‌ రియాక్షన్‌ వల్ల చూస్తుండగానే అవి చుక్కలనంటుతాయి’’అంటూ వాటి అర్థాన్ని కూడా           వివరించింది!

‘హార్మూజ్‌’పై భేటీ.. బ్రిటన్, ఫ్రాన్స్‌ వెల్లడి 
లండన్‌/పారిస్‌:  పశ్చిమాసియా యుద్ధానికి తెర దించి హార్మూజ్‌ జలసంధిని తక్షణం తెరిపించే ప్రయత్నాలను బ్రిటన్, ఫ్రాన్స్‌ ముమ్మరం చేశాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ వెల్లడించారు. ఈ అంశంపై వారిద్దరూ ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా చేపట్టిన హార్మూజ్, ఇరాన్‌ రేవుల దిగ్బంధానికి బ్రిటన్‌ మద్దతివ్వబోదని స్టార్మర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

100 మంది హెజ్బొల్లా ఫైటర్ల మృతి! 
బీరూట్‌: ఇజ్రాయెల్‌ సైన్యం, హెజ్బొల్లా దళాలు సోమవారం లెబనాన్‌లో పరస్పర దాడులకు దిగాయి. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్‌ బెల్‌ వద్ద ఇజ్రాయెల్‌ సైన్యంపై హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. అయితే పట్టణంపై ఇజ్రాయెల్‌ సైన్యం పట్టు సాధిస్తున్నట్టు లెబనాన్‌ మీడియా తెలిపింది. బింట్‌ బెల్‌ వద్ద కనీసం 100 మంది హెజ్బొల్లా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. లెబనాన్‌ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. రాజధాని బీరూట్‌పై దాడులకు ఇజ్రాయెల్‌ విరామం ఇచ్చింది. మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్‌ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండటం తెలిసిందే. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్‌లో చర్చలు జరపనున్నారు. అయినా లెబనాన్‌పై దాడులు మాత్రం ఆగబోవని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. 

చర్చలకు సిద్ధమే: ఇరాన్‌
న్యూఢిల్లీ: అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్‌ సిద్ధమేని భారత్‌లో ఆ దేశ రాయబారి మొహమ్మద్‌ ఫతాలీ ప్రకటించారు. అయితే, ‘అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదు. ఇరాన్‌ షరతులకు అంగీకరించాలి’అని పేర్కొన్నారు. తమ శక్తి ఏమిటో అమెరికాకు బాగా తెలుసని ఆయనన్నారు. హార్మూజ్‌ ఇరాన్‌దేనని స్పష్టం చేశారు. 

ఇరాన్‌ చమురు విక్రయాలపై తీవ్ర చర్యలు: అమెరికా 
ఇరాన్‌కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు/దేశాలను కోర్టుల్లో నిలబెట్టి తీరుతామని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్‌ టాడ్‌ 
బ్లాంచె ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement