అమెరికా ఓటర్‌ ‘స్వింగ్‌’ ఎటు?

Donald Trump And Joe Biden American Presidential Election Voting 2020 - Sakshi

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

బరిలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌

పోలింగ్‌బూత్‌ల ముందు బారులు తీరిన ఓటర్లు 

ముందుగానే ఓటేసిన 10 కోట్ల మంది   కీలక రాష్ట్రాలపైనే అందరి దృష్టి 

ఓటుహక్కు వినియోగించుకుంటున్న 25 లక్షల ఇండో అమెరికన్‌ ఓటర్లు 

ఓటేయండి అంటూ ట్రంప్, బైడెన్‌ ట్వీట్స్‌ 

వాషింగ్టన్‌: డెమొక్రటిక్, రిపబ్లికన్‌ పార్టీల హై వోల్టేజ్‌ ప్రచార పర్వం అనంతరం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ –19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల ముందు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ముందస్తు పోలింగ్‌ నమోదవడం విశేషం.మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే సుమారు 10 కోట్లమంది తమ తీర్పును బ్యాలెట్లలో నిక్షిప్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ‘మెయిల్‌–ఇన్‌(పోస్టల్‌)’ బ్యాలెట్ల లెక్కింపునకు మరికొన్ని రోజులు పట్టే నేపథ్యంలో.. పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల్లోనే విజేత ఎవరో తెలిసే అవకాశం లేదు. అమెరికాలో సుమారు 25 లక్షల మంది భారతీయ ఓటర్లున్నారు. వారిలో దాదాపు 13 లక్షల మంది కీలక రాష్ట్రాలైన టెక్సాస్, మిషిగన్, ఫ్లారిడా, పెన్సిల్వేనియాల్లోనే ఉన్నారు. కాగా, స్వింగ్‌ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, విస్కాన్సిస్‌ల్లో వందలాది మంది ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల ముందు బారులు తీరి తమ అవకాశం కోసం ఎదురుచూస్తుండటం కనిపించింది. వేర్వేరు టైమ్‌ జోన్స్‌ కారణంగా పోలింగ్‌ సమయం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటుంది.

ఇదాహోలోని ఓ పోలింగ్‌ కేంద్రం 
తూర్పు తీరంలోని వర్జీనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, మెయిన్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ ఉదయం 6 గంటలకు(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలు), కాలిఫోర్నియాలో ఉదయం 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలు) ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ శాతం నమోదు కావచ్చని ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నవారు భావిస్తున్నారు. పోలింగ్‌ ప్రారంభమవడానికి ముందు ‘ఓట్‌.. ఓట్‌.. ఓట్‌’ అంటూ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌  ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘మీ స్వేచ్ఛ, మీ ఉపాధి, మన భవిష్యత్తు దీనిపైననే ఆధారపడి ఉన్నట్లుగా భావించి ఓటేయండి. ఎందుకంటే అదే నిజం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘ఇది ఎన్నికల రోజు. వెళ్లి ఓటు వెయ్యి.. అమెరికా’ అని డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ ట్వీట్‌ చేశారు.

‘2008, 2012ల్లో బరాక్‌ ఒబామాతో పాటు నాపై మీరు విశ్వాసం ఉంచారు. మళ్లీ అడుగుతున్నా.. మరోసారి నన్ను, కమలను విశ్వసించండి. దేశానికి అయిన గాయాన్ని మాన్పుతాం. మీ విశ్వాసాన్ని వమ్ము చేయను’ అని బైడెన్‌ పేర్కొన్నారు. ‘మీకు, ఓటుకు మధ్య మరి దేనికి చోటివ్వకండి. ఓటింగ్‌పై అనుమానాలుంటే ఓటర్‌ హాట్‌లైన్‌కు ఫోన్‌ చేయండి’ అని డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారతీయ అమెరికన్‌ కమలా హ్యారిస్‌ ట్వీట్‌ చేశారు. ‘ఇప్పటికే ఓటేసి ఉంటే, ఈ రోజు ఓటేస్తున్న వారికి, వారి బూత్‌ను గుర్తించడంలో సాయం చేయండి’ అని మరో ట్వీట్‌ చేశారు. ‘మన జీవితాలు దీనిపై ఆధారపడ్డాయని భావించి ఓటేయాలి. మన ప్రజాస్వామ్యం దీనిపై ఆధారపడి ఉంది అని భావించి ఓటేయాలి’ అని కమల ఓటర్లకు పిలుపునిచ్చారు.

పామ్‌ బీచ్‌లోని పోలింగ్‌ కేంద్రం వద్ద మెలానియా ట్రంప్‌
వైట్‌హౌస్‌ నుంచే వీక్షణం 
పోలింగ్‌ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించగా.. జో బైడెన్‌ చర్చ్‌లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత వాషింగ్టన్‌లోని అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో కొందరు సన్నిహితులతో కలిసి ట్రంప్‌ ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో కనీసం 270 ఓట్లు సాధించిన వారు ఈ ఎన్నికల్లో విజేతగా నిలుస్తారు. ఈ ఎన్నికల్లో కరోనా వైరస్‌ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కేసులు, మరణాల సంఖ్యలోనూ అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆదివారం ఒక్కరోజే యూఎస్‌లో 81 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రచారం ముగిసే రోజు ట్రంప్‌.. కీలక రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిషిగన్, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియాల్లో ప్రచారం చేయగా.. ఆయన ప్రత్యర్థి జో బైడెన్‌ పెన్సిల్వేనియా, ఆహియోల్లో ప్రచారం నిర్వహించారు. శ్వేత సౌధంలో అడుగుపెట్టేందుకు స్వింగ్‌ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, విస్కాన్సిస్, జార్జియా, నార్త్‌ కరోలినా, ఆరిజోనాల ఫలితాలు కీలకమని ద హిల్‌ పత్రిక అభిప్రాయపడింది. 

న్యూహాంప్‌షైర్‌ నుంచే తొలి ఫలితాలు
ఈ ఎన్నికల్లో న్యూహాంప్‌షైర్‌ పట్టణంలోని మొత్తం 5 ఓట్లను గెలుచుకుని బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఈ చిన్న పట్టణం ఫలితాలు ప్రతీ ఎన్నికల్లోనూ మొదట వెలువడుతాయి.

ఎలక్టోరల్‌ ఓట్లు.. పాపులర్‌ ఓట్లు 
2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సుమారు 29 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు వేసిన మొత్తం ఓట్లను పాపులర్‌ ఓట్లు అంటారు. ప్రత్యర్థి కన్నా ఎక్కువ పాపులర్‌ ఓట్లు వచ్చినప్పటికీ ఆమె ఓడిపోయారు. అందుకు కారణం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్‌ కాలేజీ వ్యవస్థ. ఇది అమెరికా రాజ్యాంగంలో పొందుపర్చిన విధానం. ఈ విధానం ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం 270 ఎలక్టోరల్‌ ఓట్లను సాధించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ట్రంప్‌నకు 304, హిల్లరీకి 227 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి.  

అమెరికాలోని 50 రాష్ట్రాల మొత్తం ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 538. ప్రతీ రాష్ట్రానికి వేర్వేరుగా ఎలక్టోరల్‌ ఓట్లు ఉంటాయి. ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రతినిధుల సభ సభ్యులు, సెనెటర్ల సంఖ్య ఆధారంగా ఈ ఎలక్టోరల్‌ ఓట్లు ఉంటాయి. అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లున్న 10 రాష్ట్రాలను పరిశీలిస్తే.. కాలిఫోర్నియాకు 55 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా, టెక్సస్‌ ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 38. న్యూయార్క్, ఫ్లారిడాల్లో 29 చొప్పున, ఇలినాయిస్, పెన్సిల్వేనియాల్లో 20 చొప్పున, ఒహాయొలో 18, జార్జియా, మిషిగాన్‌లో 16 చొప్పున, నార్త్‌ కరోలినాలో 15 ఎలక్టోరల్‌ ఓట్లు ఉంటాయి. ఫ్లారిడా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, ఆరిజోనాల్లో ఆధిక్యత సాధిస్తే ట్రంప్‌నకు విజయావకాశాలున్నాయని భావిస్తున్నారు. మిషిగన్, విస్కాన్సిస్, పెన్సిల్వేనియాలపై, డెమొక్రాటిక్‌ పార్టీకి పెద్దగా పట్టులేని ఆరిజోనాపై జో బైడెన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు.

న్యూయార్క్‌లో ఓ హోటల్‌కు రక్షణగాప్లైవుడ్‌ బోర్డులను అమర్చిన దృశ్యం
ఘర్షణల భయంతో..
ఎన్నికల వేళ ఘర్షణలు జరగొచ్చనే వార్తల నేపథ్యంలో అమెరికాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వైట్‌ హౌస్, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. న్యూయార్క్, బోస్టస్, వాషింగ్టన్, హూస్టన్, షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని షాప్స్‌ ముందు యజమానులు ప్లైవుడ్‌ బోర్డులను రక్షణగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఇతర సంస్థలు సెక్యూరిటీని పెంచుకున్నాయి. వాల్‌మార్ట్‌ తమ దుకాణాల నుంచి తుపాకులు, ఇతర మందుగుండు సామగ్రిని తొలగించింది.న్యూయార్క్‌కు సంబంధించినంత వరకు ఇవన్నీ అపోహలేనని, తాను సిటీ పోలీస్‌ కమిషనర్‌ డెర్మాట్‌తో మాట్లాడానని న్యూయార్క్‌ మేయర్‌ బ్లాసియో పేర్కొన్నారు.

పూజ పూర్తయ్యాక ప్రసాదం పంపిణీ 
కమల గెలుపు కోసం స్వగ్రామంలో పూజలు 
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న తరుణంలో తమిళనాడులోని తులసెంథిరపురం ప్రజలు తమ ఇంటి ఆడపడుచు గెలుపుని కాంక్షిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ స్వగ్రామమైన ఆ కుగ్రామంలో ఆమె విజయాన్ని కోరుతూ పూజలు చేస్తున్నారు. తిరువారూర్‌ జిల్లాలో ఉన్న ఆ పల్లెలో ఎక్కడికక్కడే కమలా హ్యారిస్‌ పోస్టర్లు వెలిశాయి. తమ ఊరి ఆడపడుచు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలు కావాలని మనసారా కోరుకుంటూ గ్రామస్తులంతా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కమల తాతగారైన పీవీ గోపాలన్‌ స్వగ్రామమైన తులసెంథిరపురంలో ఉన్న ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ‘‘కమలా హ్యారిస్‌ నెగ్గాలి. అదే మేము కోరుకుంటున్నది. ఆమె గెలిస్తే భారత్‌కి, తమిళనాడు రాష్ట్రానికే కాదు, మా పల్లెకి కూడా అత్యంత గర్వకారణం’’ అని స్థానికులు అంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top