ఇన్ బాక్స్
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఇటీవల విడుదల కావడం హైదరాబాద్ పర్యావరణ భవిష్యత్తుకు కీలక మలుపుగా ప్రచారం అవుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల పరిధిని కవర్ చేసే ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుండి 4,100 కోట్ల రుణం ప్రతిపాదించారు. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో అమలు కాబోయే ఈ ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కాలుష్యంతో నిండిన నదిని ఆధునిక పట్టణ కారిడార్‌గా మార్చుతామని హామీ ఇస్తోంది. మెరిసే ప్రెజెంటేషన్లు, అంతర్జాతీయ కన్సల్టెన్సీ పేర్ల వెనుక ఒక కీలక ప్రశ్న: ప్రభుత్వం నిజంగా నదిని పునర్నిర్మిస్తుందా? లేక కేవలం నది ఒడ్డులను అలంకరిస్తుందా?
ఈ ప్రణాళికలో మలిన జలశుద్ధి కేంద్రాలు, అందమైన రివర్‌ఫ్రంట్‌లు, వాణిజ్య మండ లాలు, ఎలివేటెడ్ కారిడార్లు, పర్యాటక సదు పాయాల ప్రతిపాదనలు ఉన్నాయి. అధికా రులు ఇవి నదిని శుభ్రం చేస్తాయనీ, వరద లను నియంత్రిస్తాయనీ, ఆర్థిక కార్యకలాపా లకు కేంద్రంగా మారుస్తాయనీ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిజమైన పర్యావరణ పునరుద్ధరణ కంటే రియల్ ఎస్టేట్ ఆధారిత అభివృద్ధి వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోందని విమర్శకులు అంటున్నారు.
హైదరాబాద్ నగరం రోజుకు సుమారు 1,950 ఎమ్‌ఎల్‌డీ మలిన జలాలను ఉత్పత్తి చేస్తోంది. అందులో సుమారు 750 ఎమ్‌ఎల్‌డీ నేరుగా మూసీ నదిలోకి చేరుతోంది. నదిలో ఆక్సిజన్ స్థాయులు అత్యంత తక్కువగా ఉండగా... భారీ లోహాలు, ప్రమాదకర బ్యాక్టీరియా నీటిని మానవులకు, జీవజాలానికి అనర్హంగా మార్చాయి. ఇంకా కొత్త శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినా, కాలుష్యాన్ని మూలంలోనే ఆపకపోతే నది ఎప్పటికీ మురుగు కాలువగానే మిగిలిపోతుంది. అదనంగా, రివర్‌బెడ్‌లో పేరుకుపోయిన విషపూరిత మట్టి నిర్వహణపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నది ఒడ్డున నివసిస్తున్న వేలాది కుటుంబాల భవిష్యత్తు గురించి స్పష్టత లేదు.
చదవండి: దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కోసం చట్ట సవరణ!
నిజంగా మూసీ బాగుపడాలంటే... మలిన జలం ఒక్క చుక్క కూడా నదిలోకి వెళ్లకూడదు. శాస్త్రీయ విధానంలో స్లడ్జ్ నిర్వహణ, కాంక్రీట్ నిర్మాణాల కంటే సహజ పర్యావరణ పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వడం, నీటి నాణ్యతపై రియల్ టైమ్ పబ్లిక్ మానిటరింగ్, ప్రజల భాగస్వామ్యం, బాధ్యత వంటివి లేకపోతే ఈ ప్రాజెక్టు మరొక ఖరీదైన ప్రయోగంగా మిగిలిపోవచ్చు.
– షేక్ బాబా
ప్రజా సైన్స్ వేదిక ప్రధాన కార్యదర్శి


