Sreemoyee Piu Kundu: వారు సింగిల్‌ ఉమెన్‌గా ఉండటానికి ఎన్నో కారణాలు.. అయితే

Status Single by Sreemoyee Piu Kundu was launched at Delhi - Sakshi

‘హాయ్‌ శైలి... ఇన్నాళ్ల తరువాత నిన్ను చూసే భాగ్యం కలిగింది. ఎలా ఉన్నావు?’
‘నన్ను గుర్తు పట్టావా?’
‘నాకు అక్కలాంటిదానివి నువ్వు. ఎందుకు గుర్తుపట్టను!’
‘కొత్త ఇల్లు కొన్నందుకు శుభాకాంక్షలు భార్గవి. ఫొటోల్లో కంటే సన్నగా కనిపిస్తున్నావు. ఇలాగే బాగున్నావు’

... ఇవి ఏ ఫంక్షన్‌ హాల్‌లోనో వినిపించిన మాటలు కాదు. ఈ హాల్‌లో వివాహ వేడుకలాంటిదేమీ జరగడం లేదు. అందరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే ఎప్పుడూ ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు.
ఈ సమావేశానికి వచ్చిన వాళ్లు సింగిల్‌ ఉమెన్‌. వారు సింగిల్‌ ఉమెన్‌గా ఉండడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే వారందరిని ఒకటి చేసింది, ఒక కుటుంబంలా నిలిపింది స్టేటస్‌ సింగిల్‌.

కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న సింగిల్‌ ఉమెన్స్‌ ఆన్‌లైన్‌ వేదికగా ఒక బృందంగా ఏర్పడ్డారు. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సలహాలు...ఒకరితో ఒకరు పంచుకునేవారు. తమ గ్రూప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు నడిచొచ్చారు. అందరూ దిల్లీలో సమావేశం అయ్యారు. ‘ఒకరినొకరం ప్రత్యక్షంగా కలుసుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతం గా మేమందరం ఒకే కుటుంబం అనే భావన కలిగింది’ అంటుంది రచయిత్రి, కాలమిస్ట్‌ శ్రీమోయి కుందు.

అలా వచ్చిందే ఈ పుస్తకం..
‘స్టేటస్‌ సింగిల్‌’ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించింది. ‘రియల్‌ అకేషన్‌’ ‘హ్యాపియర్‌ టైమ్‌’ ‘యువర్‌ బిగ్‌డే’... తన ప్రతి పుట్టిన రోజు వేడుకల్లో తరచు వినిపించే మాటలు ఇవి. ఈసారి తన పుట్టిన రోజును ఒక వేడుకలా జరుపుకోకుండా, గుర్తుండి పోయే పని ఒకటి చేయాలనుకుంది. అలా వచ్చిందే ఆమె రాసిన ‘స్టేటస్‌ సింగిల్‌’ అనే పుస్తకం. దీని కోసం 30–40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్బన్‌  ఉమెన్స్‌ మూడువందల మందిని ఇంటర్వ్యూ చేసింది. వారి అనుభవాలను రికార్డ్‌ చేసింది.

ఈ పుస్తకం సింగిల్‌ ఉమెన్‌ కష్టాలు, కన్నీళ్లనే కాదు... వారి పోరాట పటిమనూ కళ్లకు కట్టింది. సింగిల్‌ ఉమెన్‌పై రకరకాల అపోహలు ఉన్నాయి. వారికి కోపం ఎక్కువని. ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని... ఇలాంటి ఎన్నో అపోహలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది.

‘నేను రాసిన పుస్తకం సెల్ఫ్‌–హెల్ప్‌ బుక్‌లా ఉపయోగపడకపోవచ్చు. స్ఫూర్తిదాయక పుస్తకం కాకపోవచ్చు. కానీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఏముంటుంది’ అని కుందు చెబుతున్నప్పటికీ ఎంతోమంది సింగిల్‌ ఉమెన్‌కు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా, సెల్ఫ్‌–హెల్ప్‌ బుక్‌లా ఉపయోగపడుతుంది.
తర్వాత ఏమిటి మరి? ఢిల్లీలోనే కాదు దేశం నలుమూలలా ‘స్టేటస్‌ సింగిల్‌’ సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరికొకరు అండగా నిలవాలనేది లక్ష్యం. వారి లక్ష్యం ఫలించాలని ఆశిద్దాం.

చదవండి: Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా మా కమ్యూనిటీలో

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top