Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి

Parenting: Parents, donot stress kids over exam results - Sakshi

పేరెంటింగ్‌

పరీక్షల రిజల్ట్స్‌ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్‌ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం.
ఓడిన పిల్లలకు అండగా నిలవండి.

కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్‌ బాగానే రాసినా రిజల్ట్స్‌ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్‌ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్‌ టైమ్‌ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్‌ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్‌ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి.

ఫెయిల్‌ ఎందుకు?
ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్‌ పూర్తి చేశారా? నోట్స్‌ సరిగా ఇచ్చారా? స్టూడెంట్‌ ఆ సబ్జెక్ట్స్‌ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్‌ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్‌ అవసరమైతే సరైన ట్యూషన్‌ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్‌ సీరియస్‌ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేయగలిగాడా? ఎగ్జామ్‌ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్‌ అవడానికి కారణాలు. టెన్త్‌ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్‌ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్‌లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే.

ఏం చేయకూడదు?
పిల్లలు ఫెయిల్‌ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఏం చేయాలి?
‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్‌ కావాలి? ఈ పరీక్షలు పాస్‌ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్‌/లెక్చరర్‌ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి.

పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్‌ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా.
 
పిల్లలు ఫెయిల్‌ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top