144 ఏళ్ల క్రితం కేదార్‌నాథ్‌ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..! | Anand Mahindra Shares Kedarnath Rare Photo Of 144 Years Ago | Sakshi
Sakshi News home page

144 ఏళ్ల క్రితం కేదార్‌నాథ్‌ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!

Apr 27 2026 4:31 PM | Updated on Apr 27 2026 4:41 PM

Anand Mahindra Shares Kedarnath  Rare Photo Of 144 Years Ago

అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ యాత్ర ప్రారంభకానుంది. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం, నెలల తరబడి శీతాకాలపు మూసివేత తర్వాత మరోసారి భక్తుల కోసం తలుపులు తెరుచుకోనుంది. ఛార్‌ధామ్‌ యాత్ర పేరుతో ఇక్కడకు వచ్చి ఆ మహాదేవుడిని కొలుస్తుంటారు భక్తులు. అయితే ఇప్పుడు ఆధునికత యాత్రను కొంచెం సులభతరం చేయగలిగింది. కానీ వందేళ్ల క్రితం ఈ కేదార్‌నాథ్‌ ఎలా ఉండేదో అందుకు సంబంధించిన ఫోటోని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు.  ఎలా ఉందంటే..

1882లో తీసిన కేదార్‌నాథ్ ధామ్‌కు సంబంధించిన మొట్టమొదటి ఛాయాచిత్రాలలో ఒకటిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా షేర్‌  చేశారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి రోడ్లు, రైల్వే స్టేషన్లు, హెలికాప్టర్లు ఏవీ లేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రయాణం సౌలభ్యం అయిపోయాక..అక్కడున్న అందాల్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం అంటూ ఆలోచింపచేసే ప్రశ్నను లేవనెత్తారు. 

టెక్నాలజీ సౌలభ్యతను అందివ్వాలేగానీ..ఏదో వచ్చాం, వెళ్లిపోయాం అన్నట్లు కాదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహీంద్రా. ఆ మంచు కొండల మధ్య కొలువైన ఆ మహా దేవుడి చుట్టుతా ఉన్న అద్భుతాలు, ప్రకృతి రమ్యతను తనివితీరా ఆస్వాదించడం ఓ కళ. అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమయ్యేది అనేది పలువురి ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. ఆ విషయాన్నే గుర్తుచేసేలా ఇలా నాటి ఫోటోని షేర్‌ చేశారు మహీంద్రా. 

కాగా, కేదార్‌నాథ్ యాత్ర ఊపందుకుంటున్న తరుణంలో మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. యాత్ర ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే 1.1 లక్ష మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్‌లో యాత్రికుల రాకపోకలు సజావుగా సాగడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రణాళికే కారణమని ఆలయ అధికారులు అన్నారు. 

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సుమారు 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్, శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ప్రతి ఏడాది పరిమిత కాలం వరకు మాత్రమే(ఆరు నెలలు) సందర్శనకు అందుబాటులో ఉంటుంది.

 

(చదవండి:  పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement