భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ప్రభుత్వ తీరు | - | Sakshi
Sakshi News home page

భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ప్రభుత్వ తీరు

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ప్రభుత్వ తీరు

భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ప్రభుత్వ తీరు

ప్రజల్లో అశాంతి సృష్టించేందుకు

రాష్ట్ర సర్కార్‌ ప్రయత్నం

తిరుమల స్వామి పవిత్రతపై పెద్ద

అభాండం వేసిన చంద్రబాబు

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు

రాజమహేంద్రవరం రూరల్‌: పవిత్రమైన తిరుమల లడ్డూపై రాజకీయం చేసి ప్రయోజనం పొందాలన్న టీడీపీ సర్కార్‌, సీఎం చంద్రబాబు కుట్ర భగ్నమైనా.. ఇప్పటికీ గత ప్రభుత్వంపై అదే పనిగా నింద వేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బ తీశారన్నారు. ఒక వేలు జగన్‌ వైపు చూపించాలని అనుకుంటే నాలుగు వేళ్లు చంద్రబాబు వైపు చూపిస్తున్నాయని అన్నారు. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ పదేపదే ఆరోపించినట్లు, తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు, పంది కొవ్వు, చేప నూనె అవశేషాలు లేవని దేశంలో ప్రతిష్టాత్మకమైన ల్యాబ్‌లు, ఎన్‌డీఆర్‌ఐ (నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) స్పష్టం చేశాయన్నారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సీబీఐ సిట్‌ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసిందన్నారు. దీంతో, చేసిన తప్పుకు కనీసం క్షమాపణ చెప్పకుండా, మాట మార్చి ఆ నెయ్యిలో కెమికల్స్‌ కలిశాయని.. ఇంకా దిగజారి బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ కోసం వాడే లిక్విడ్‌ కూడా కలిపారని చంద్రబాబు నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

ఈ ప్రశ్నలకు బదులేదీ..

ఈ సందర్భంగా సర్కార్‌కు వేణు పలు ప్రశ్నలు సంధించి.. వాటికి సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘మీరు కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంకర్లు టీటీడీలోకి వచ్చింది మీ హయాంలోనే కాదా? తిప్పి పంపిన నెయ్యి ట్యాంకర్లు దొడ్డిదారిన టీటీడీలోకి ఎలా వచ్చాయి? అసలు భోలేబాబా డెయిరీకి ద్వారాలు తెరిచింది చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో కేజీ నెయ్యిని రూ.320, రూ.321కే కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? మరి అలాంటప్పుడు కేజీ నెయ్యి రూ.320కే దొరుకుతుందా అని ఇప్పుడెలా ప్రశ్నిస్తున్నారు? నిజానికి అసలు తిరుమలలో నెయ్యి కల్తీకి సంబంధించిన ఆనవాళ్లు ఎప్పుడు బయటపడ్డాయి? దానిపై ఎలాంటి ఆధారాలున్నాయి? ఇదంతా ఎవరి హయాంలో జరిగింది? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పాలని వేణు డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు కల్తీ కథ ఇదీ..

2024 మార్చి 16న రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని, అదే సంవత్సరం మే 13న ఎన్నికలు జరిగాయని వేణు గుర్తు చేశారు. 2024 మే 15న తిరుమలలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు తెరచి, ఏఆర్‌ డెయిరీకి ఆర్డర్‌ ఇచ్చారన్నారు. 2024 జూన్‌ 4న ఎన్నికలు ఫలితాలు వచ్చాయని, అదే సంవత్సరం జూన్‌ 12, 20, 25, జూలై 4 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు ఏఆర్‌ డెయిరీ నుంచి తిరుమలకు వచ్చాయని వివరించారు. అక్కడి ల్యాబ్‌లో చేసిన నాణ్యతా పరీక్షల్లో పాజిటివ్‌ రిపోర్టు రావడంతో అనుమతించారన్నారు. 2024 జూలై 6, 12 తేదీల్లో రెండేసి చొప్పున 4 ట్యాంకర్లు రాగా, అందులోని నెయ్యిని కూడా టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించారన్నారు. ఆ నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలడంతో ఎన్‌డీడీబీకి శాంపిల్స్‌ పంపించారని చెప్పారు. 2024 జూలై 23న ఎన్‌డీడీబీ నుంచి ల్యాబ్‌ రిపోర్టు రావడంతో జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపించారన్నారు. 2024 జూలై 27న ఆ ట్యాంకర్లు శ్రీకాళహస్తి చేరువలోని ఒక స్టోన్‌ క్రషర్‌ వద్దకు చేరాయన్నారు. వాటిని అక్కడే రహస్యంగా ఉంచారని, అవే ట్యాంకర్లు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తిరుమలకు తిరిగి వచ్చాయని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారని వివరించారు. ఈ విషయాలన్నింటినీ సీబీఐ సిట్‌ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసిందని వేణు చెప్పారు. తేదీలతో సహా వీటిని చూస్తే చంద్రబాబు హయాంలోనే లడ్డూ కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. కానీ, దానిని కప్పిపుచ్చేందుకు కోట్ల మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 2018లో చంద్రబాబు హయాంలోనే ఏఆర్‌ డెయిరీ తిరుమలకు వచ్చిందన్న విషయమైనా చంద్రబాబు ఒప్పుకుంటారో లేదోనని అన్నారు.

ఇక్కడా రెండు నాల్కలే..

లడ్డూ కల్తీపై కూడా చంద్రబాబు రెండు నాల్కల ధోరణితోనే ఉన్నారని వేణు విమర్శించారు. తొలుత జంతు అవశేషాలని, ఆ తరువాత మాట మార్చి కెమికల్స్‌ అంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. తిప్పి పంపిన నాలుగు ట్యాంకర్లు చంద్రబాబు హయాంలో టీటీడీ లోపలకు ఎలా వెళ్లాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజానికి నెయ్యి సేకరణకు 2024–29 మధ్య అయినా, 2019–24 మధ్య అయినా సిస్టమ్‌ ఒక్కటేనని అన్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అప్రూవల్‌ తీసుకోవాలన్నారు. వచ్చిన నెయ్యిని తిరుమలలో కూడా పరీక్షిస్తారన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో తిరుమలలో ల్యాబ్‌ను ఇంకా ఆధునీకరించామన్నారు. దీంతో, తమ హయాంలో నాణ్యత సరిగ్గా లేదని 18 ట్యాంకర్లను వెనక్కి పంపించామని వేణు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement