Land Dispute: తండ్రీ, ఇద్దరు కొడుకుల ఉసురు తీసిన భూ తగాదా

Three Brutally Assassinated In Bhupalpally District - Sakshi

ముగ్గురిని బలిగొన్న భూవివాదం

తండ్రి, ఇద్దరు కుమారుల హతం

జయశంకర్‌ భూపాలపల్లిలోరక్తసంబంధీకుల ఘాతుకం

సాక్షి, భూపాలపల్లి:  ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూవివాదం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొంది. సొంత సోదరుడు, ఆయన ఇద్దరు కుమారులను పాశవికంగా నరికి చంపారు దుండగులు. ఫ్యాక్షనిజాన్ని మరిపించేలా ఏకకాలంలో ముగ్గురిని హత్యచేసిన ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లావుడ్యా మంజనాయక్‌ (68), ఆయన కుమారులు సారయ్య నాయక్‌ (45), భాస్కర్‌ నాయక్‌ (38) హతమయ్యారు.  

పదేళ్లుగా గొడవలు.. 
బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన లావుడ్యా మంజనాయక్, సమ్మయ్య నాయక్, మహంకాళి నాయక్, రజ్జానాయక్‌ సొంత అన్నదమ్ములు. వీరిలో మంజనాయక్‌ 15 ఏళ్ల క్రితం గ్రామశివారులో 20 ఎకరాల భూమి కొన్నాడు. పక్కనే కొన్ని గుంటల మిగులు భూమి ఉంటే తన భూమితో పాటే సాగు చేసుకుంటుండమే కాకుండా తన భూమితో కలిపి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఇదే క్రమంలో మిగిలిన అన్నదమ్ములు ఆ భూమిలో తమకూ హక్కు ఉందని అడ్డుపడుతుండగా పదేళ్లుగా వివాదం కొనసాగుతుంది. 

పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. శనివారం మంజనాయక్, ఆయన ముగ్గురు కుమారులు సారయ్య నాయక్, భాస్కర్‌ నాయక్, సమ్మయ్య నాయక్, కోడలు సునీత, మనవడు భూమి వద్దకు వెళ్లి పత్తి కట్టె ఏరుతూ దుక్కి దున్నుతున్నారు. ఇది తెలుసుకున్న మహంకాళి నాయక్, మరికొందరు కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి వెళ్లారు. తమతోపాటుగా తెచ్చుకున్న కారం పొడిని మంజనాయక్, ఆయన కుమారులపై చల్లి గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మంజనాయక్, పెద్దకుమారుడు సారయ్య, చిన్నకుమారుడు భాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమారుడు సమ్మయ్య నాయక్‌ తలపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై తప్పించుకుని పారిపోయాడు. కోడలు సునీత చేయి విరిగింది. సుమారు పదిమంది తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.

చదవండి: పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి హత్య
ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top