మహిళ హత్య కేసు మిస్టరీ.. అనుమానం నిజమైంది..

Police Solve Woman Assassination Case Mystery In Chittoor District - Sakshi

చిత్తూరు రూరల్‌: మండలంలోని బీఎన్‌ఆర్‌ పేట వద్ద వారం క్రితం వెలుగుచూసిన మహిళ హత్య కేసులో భర్తే నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో సీఐ బాలయ్య, ఎస్‌ఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. జీడీనెల్లూరు మండలం నల్లరాళ్లపల్లెకు చెందిన చిన్నబ్బ మందడి కుమార్తె మోహన అలియాస్‌ రోజా(23)కు చిత్తూరు మండలం కుర్చివేడు పంచాయతీ వీఎన్‌పురం గ్రామానికి చెందిన ప్రకాష్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది.
చదవండి: సంతోషంగా వధూవరులు డ్యాన్స్‌.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం..

కొంత కాలానికే భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ప్రకాష్‌ రోజూ తాగి వచ్చి రోజాను వేధించేవాడు. దీంతో అప్పుడప్పుడు ఆమె మనస్తాపంతో పుట్టింటికి వెళ్లిపోయి కొన్నిరోజులు ఉండి వచ్చేది. ఈక్రమంలో ఇటీవల మళ్లీ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తండ్రి వద్దని వారించినా వినకుండా ప్రకాష్‌ ఇంటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోజా ఇక్కడ తాను ఉండలేనని తండ్రి వద్దకు వెళ్లిపోతానంటూ కాలినడకనే బయలుదేరింది. బైక్‌పై ఆమె వెనుకే వచ్చిన ప్రకాష్‌ మార్గం మధ్యలో అడ్డుకున్నాడు.

మాటామాటా పెరగడంతో దగ్గరలోని బండరాయి తీసుకుని రోజా తలపై మోదాడు. ప్రాణాలు పోకపోవడంతో చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. 18వ తేదీ సాయంత్రం అటు వైపు వెళ్లిన స్థానికులు తేలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మూడు రోజుల తర్వాత ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా రోజా తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు చూపించిన రోజా తాళిబొట్టు, ఇతర ఆధారాలను చూసి తమ కూతురే అని నిర్ధారించారు. రోజాను ఆమె భర్తే చంపేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. రోజా భర్త ప్రకాషే నిందితుడని తేలడంతో మిగిలిని ఇద్దరినీ విడిచిపెట్టేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top