
మేడ్చల్‌రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాఘవేంద్రనగర్ కాలనీలో జరిగింది. ఎస్సై మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లుకు చెందిన రత్తం నవీన్ భార్య స్వప్న (24), ముగ్గురు పిల్లలతో కలిసి రాఘవేంద్రనగర్ కాలనీలో ఉంటున్నారు.
మంగళవారం ఉదయం భర్త నవీన్ పనికి వెళ్లగా.. ఇంట్లో ఉన్న ఆమె సీలింగ్ రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో భర్త ఇంటికొచ్చే సరికి ఉరేసుకుని కనిపించింది. లోపలి నుంచి గడియ ఉండటంతో తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
మరో ఘటనలో
మేడ్చల్‌రూరల్: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన మాధవరావు కుటుంబంతో కలిసి మేడ్చల్‌లో నివసిస్తున్నారు. కుమార్తె శైలజ (24), స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంది. కాగా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికొచ్చేసరికి శైలజ విగత జీవిగా పడి ఉండటం, వీడియో కాల్ ఆన్‌చేసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.