స్నేహితుడిని కాపాడబోయి మృత్యువాత

A Man Died To Save His Friend - Sakshi

మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో గురువారం పలవెల హసన్‌ ప్రీతమ్‌(21) మునిగిపోయి మృతి చెందాడు. అప్పటి వరకు స్నేహితులతో ఆనందంగా గడిపిన హసన్‌కు పొల్లూరు జలపాతం యమపాశమైంది. మృతుడు హసన్‌ ప్రీతమ్‌ కాకినాడ కార్పొరేషన్‌లో పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టెమెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి గురువారం ఉదయం 4 గంటలకు రెండు మోటార్‌బైక్‌లపై బయలుదేరి 11 గంటలకు  పొల్లూరు జలపాతం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు హసన్‌ప్రీతమ్, మరో స్నేహితుడు ద్విగిజయ్‌ అబురుక్‌లు జలపాతంలోకి దిగారు. స్నానం చేస్తుండగా ద్విగిజయ్‌ నీటిలో మునిగిపోవడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో హసన్‌ ప్రీతమ్‌ నీటిలో మునిగిపోయి చనిపోయాడు. సంఘటన జరిగిన వెంటనే ఎస్‌ఐ వి.సత్తిబాబు తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. 

గత ఏడాదే ఉద్యోగం వచ్చింది 
పలవెల హసన్‌ ప్రీతమ్‌ తల్లిదండ్రులు చనిపోయారు. సొంత గ్రామం మండపేట. తల్లి పద్మ మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తూ 2020 సంవత్సరంలో చనిపోయారు. దీంతో కుమారుడు హసన్‌కు 2021 సంవత్సరంలో కాకినాడ కార్పొరేషన్‌లో పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. మృతుడికి ఒక సోదరి ఉంది. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్నారు. బంధువులు పొల్లూరు బయలు దేరారు.  

ఒంటరైన సోదరి
కాకినాడ : కన్నతల్లి అనారోగ్యంతో మృత్యువాతపడింది. కొద్ది నెలలకే తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. తనే అమ్మా నాన్నలా తోడుగా నిలిచిన అన్నయ్యను కూడా మరణం వెంటాడింది. ఇలా మూడేళ్ళ వ్యవధిలో ఒకరి వెంట ఒకరుగా కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో ఇప్పుడామె ఒంటరి అయ్యింది. ఆమె దయనీయ స్థితిని చూసిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో పడి పలివెల హసన్‌ప్రీతమ్‌ మరణించాడన్న సమాచారంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే...కాకినాడ నగర పాలకసంస్థ అసిస్టెంట్‌ ఇంజినీ ర్‌గా పనిచేస్తున్న పద్మశ్రీ రెండున్నరేళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయారు.

ఆమె మరణించిన మరికొద్ది నెలలకే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తండ్రి వెంకటేశ్వరరావును కూడా మృత్యువు వెంటాడి తీసుకుపోయింది. తల్లి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వీరి కుమారుడు హసన్‌ప్రీతమ్‌కు కారుణ్య నియామకం ద్వారా కాకినాడ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ధైర్యాన్ని కూడగట్టుకుని చెల్లెలు హర్షితను చదివిస్తూ తనే అమ్మా, నాన్నగా, అన్నగా తోడుండి బాసటగా నిలిచాడు. అన్న ప్రోత్సాహంతో కొద్ది రోజుల క్రితమే హర్షిత విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో బీటెక్‌లో చేరింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబాన్ని మరోసారి విధి వెంటాడింది. అవివాహితుడైన అన్న హసన్‌ ప్రతీమ్‌ గురువారం రంపచోడవరం ఏజన్సీ   పొల్లూరు జలపాతంలో గల్లంతై మృత్యువాత పడ్డాడన్న సమాచారం బయటపడింది. దీంతో హర్షిత పరిస్థితిని తలుచుకుని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

(చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్‌ బారిన పడినట్టే..!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top