Hyderabad: గురుకుల కాలేజీలో దారుణం

Attack With Blade On Student In Gurukul College - Sakshi

గచ్చిబౌలి/ హైదరాబాద్‌: గాఢనిద్రలో ఉన్న ఇంటర్‌ విద్యార్థి గొంతుకోసిన ఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో ఈనెల 25న సాయంత్రం అల్పాహారం వడ్డించే సమయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్‌ (16) లైన్‌లో ఉన్నాడు. రెండో సంవత్సరం విద్యార్థి సేమియా వడ్డిస్తుండగా సాత్విక్‌ చేతిపై పడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం వడ్డించిన విద్యార్థి.. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా, అతడు సాత్విక్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో టీచర్లు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత.. రాత్రి హాస్టల్‌లో నిద్రపోయిన సాత్విక్‌ 1.30 సమయంలో గొంతు వద్ద నొప్పిగా అనిపించి, నిద్రలేవగా గొంతు భాగంలో రక్తం రావడం గమనించి స్నేహితులకు చెప్పాడు. గొంతు వద్ద రక్తస్రావం అవుతుండటంతో వెంటనే గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 18 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయం లేదని, విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనపై చేయిచేసుకున్న విద్యార్థే దాడిచేసి ఉంటాడని గచ్చిబౌలి పోలీసులకు సాత్విక్‌ ఫిర్యాదు చేశాడు. కాగా, బ్లేడ్‌తో అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అనుమానిత విద్యార్థిని పోలీసులు విచారించి సొంత పూచీకత్తుపై పంపించినట్లు తెలిసింది. తమ కొడుకును కేసులో ఇరికిస్తున్నారని అనుమానితుని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

విద్యాక్షేత్రంలో కలకలం.. 
గ్రామీణ పేద విద్యార్థులకు ఉత్తమవిద్య అందిస్తూ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అగ్రభాగంలో ఉంది. ఇదే కళాశాలలో ఫిబ్రవరి 19న ఇంటర్‌ విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా సాత్విక్‌పై దాడి జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత భార్యను..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top