ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌లోనూ ఇకపై ప్రభుత్వ గోల్డ్‌ బాండ్‌

Sovereign Gold Bond can be bought at RBI retail direct portal - Sakshi

నేటితో ఎనిమిదవ సిరీస్‌కు ముగింపు  

ముంబై: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ ఇకపై ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌లోనూ లభ్యం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిదవ సిరీస్‌ ఈ నెల మూడవ తేదీతో (శుక్రవారం) ముగియనున్న సంగతి తెలిసిందే. 29వ తేదీన ఈ సిరీస్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభుత్వ గోల్డ్‌ బాండ్స్‌ నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌  ఆఫ్‌ ఇండియా ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెల్లో ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను ప్రారంభించారు. వ్యక్తులు నేరుగా ట్రెజరీ బిల్లులు, డేటెడ్‌ సెక్యూరిటీలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ) స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌ (ఎస్‌డీఎల్‌) ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ నుండి నేరుగా కొనుగోలు చేసే సౌలభ్యతను ఈ స్కీమ్‌ కల్పిస్తోంది.  https://rbiretaildirect.org.in లో ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ ఇందుకు వేదికగా ఉంది.  

సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లకు అనుసంధానం
ఈ స్కీమ్‌ కింద రిటైల్‌ ఇన్వెస్టర్లు (వ్యక్తిగతంగా) ఆన్‌లైన్‌ రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంట్‌ (ఆర్‌డీజీ అకౌంట్‌)ను ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్లను ప్రత్యక్షంగా తమ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లకు అనుసంధానించవచ్చు.  స్క్రీన్‌ ఆధారిత ఎన్‌డీఎస్‌–వోఎం ద్వారా సెకండరీ మార్కెట్‌ ఆపరేషన్స్, ప్రభుత్వ సెక్యూరిటీల జారీ వంటి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వ్యక్తిగత ఆర్‌డీజీ అకౌంట్లను వినియోగించుకోవచ్చు. ఎన్‌డీఎస్‌–వోఎం అనేది ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి సెకండరీ మార్కెట్‌ ట్రేడింగ్‌ కోసం ఉద్దేశించిన ఒక స్క్రీన్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ.

ఆర్‌బీఐ నియంత్రణలో ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకూ ఇది బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా ద్వారా ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్‌ ఫ్రీ టెలిఫోన్‌ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా), ఈమెయిల్‌ కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవని ఆర్‌బీఐ తెలిపింది. దేశీయంగా సేవింగ్స్‌ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్‌ ఐడీ, రిజిస్టర్‌ మొబైల్‌ నంబరుతో రిటైల్‌ ఇన్వెస్టర్లు నమోదు చేయించుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు.. సెటిల్మెంట్‌ రోజున ఆర్‌డీజీ ఖాతాలోకి జమవుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top