Reliance: చైనా కంపెనీపై ముఖేష్‌ అంబానీ కన్ను

Reliance Industries Is Planning To Acquire The Rec Group - Sakshi

ముంబై: సోలార్‌ ప్యానెల్స్‌ తయారీ సంస్థ ఆర్‌ఈసీ గ్రూప్‌ను దక్కించుకోవడంపై దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) దృష్టి పెట్టింది. చైనా నేషనల్‌ కెమికల్‌ కార్పొరేషన్‌ (కెమ్‌చైనా) నుంచి కంపెనీని కొనుగోలు చేయాలని ఆ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ భావిస్తున్నారు. ఈ డీల్‌ విలువ సుమారు 1–1.2 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. దీని కోసం దాదాపు 500–600 మిలియన్‌ డాలర్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు అంతర్జాతీయ బ్యాంకులతో రిలయన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

చదవండి : కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్‌ అంబానీ కుబేరుడే! 

త్వరలోనే ఈ డీల్‌ గురించి ప్రకటన చేయొచ్చని వివరించాయి. నార్వే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్‌ఈసీ గ్రూప్‌ .. యూరప్‌లోనే అతి పెద్ద సోలార్‌ ప్యానెల్స్‌ తయారీ సంస్థ. సింగపూర్‌లో రిజిస్టర్‌ అయ్యింది. ఫొటోవోల్టెయిక్‌ (పీవీ) అప్లికేషన్లకు అవసరమైన సిలికాన్‌ మెటీరియల్, మల్టీ–క్రిస్టలైన్‌ వేఫర్లు, గృహాలు .. పరిశ్రమలు .. సోలార్‌ పార్కుల్లో ఉపయోగించే మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది.  

పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి ఆర్‌ఈసీ కొనుగోలు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధునాతన టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాలు కూడా కంపెనీకి అందుబాటులోకి వస్తాయని వివరించాయి. సౌర విద్యుత్‌ పరిశ్రమ ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఆర్‌ఈసీని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం భారత్‌కి ఏటా 3 గిగావాట్ల సోలార్‌ సెల్స్, 15 గిగావాట్ల మాడ్యూల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నాయి. 90 శాతం ఉత్పత్తులను చైనా, చైనీస్‌ కంపెనీల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. 2019–20లో భారత్‌ 2.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే సోలార్‌ వేఫర్లు, సెల్స్, మాడ్యూల్స్, ఇన్వర్టర్లను దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top